రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఎక్కడిక్కకడ నీరు నిలిచి... దోమలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా చాలామందిలో ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయి.
రక్తం లీకేజీ కాకుండా..
ఆరోగ్యకర వ్యక్తి శరీరంలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల తెల్లరక్తకణాలు ఉండాలి. ఇవి శరీరంలో ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి. రక్తం బయటకు రాకుండా, లీకేజీ కాకుండా కాపాడుతాయి. జ్వర తీవ్రత ఎక్కువైన వారిలో తెల్లరక్తకణాలు తగ్గిపోతాయి. దీంతో రక్తం ముక్కు, నోటి నుంచి కారుతుంది. మలం రక్తం రంగులోకి మారుతుంది.
వరంగల్ ఎంజీఎంలో పీఆర్‌పీ..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో తెల్లరక్త కణాలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేసే యంత్రం గతేడాది నుంచి పని చేయడం లేదు. ఇటీవల మలేరియా, డెంగీ విజృంభిస్తుండటంతో అధికారులు కొత్త యంత్రం తెప్పించారు. సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లేట్‌లెట్స్ రిచ్ ప్లాస్మా(పీఆర్‌పీ) కావాల్సిన వారు ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో సంప్రదిస్తే అందిస్తామని అధికారులు తెలిపారు.
గత రెండేళ్లుగా కొవిడ్‌తో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతోంది. కానీ ప్రజలను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విజృంభిస్తున్నాయి. జ్వర పీడితుల్లో ప్లేట్ లెట్ల(తెల్లరక్త కణాలు) శాతం తగ్గుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మలేరియా 259, డెంగీ 47 కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో జ్వర బాధితులున్నారు.
దోమలు కుడితే..
దోమల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. పరిసరాల్లో నిల్వ ఉన్న శుభ్రమైన నీటిలో పెరిగే ఆడ ఏడిస్ అనే ఈజిప్ట్ దోమ పగటివేళ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి రక్తం తాగి.. ఇతరులను కుట్టడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది.