కర్రతో అందమైన శిల్పాన్ని చెక్కి వాటికి ప్రాణం పోస్తున్నారు.. కనుకుంట్ల సురేందర్. ప్రాచీనమైన కళను భవిష్యత్ తరాలకు అందించాలనేది తన ఉద్దేశమని తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ విభాగం ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో 60 వరకు శిల్పాకృతులను ప్రదర్శనకు ఉంచారు. హన్మకొండ నివాసి అయిన సురేందర్.. చిన్నతనం నుంచే కర్ర శిల్పాలపై మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత గోపాల్ రెడ్డి అనే గురువు వద్ద మరింత నైపుణ్యం కోసం తర్ఫీదు తీసుకున్నారు. కళపై పట్టు సాధించారు. ఆ అనుభవంతో వేప, నల్లమద్ది, యూకలిప్టస్, తుమ్మ.. బొడ్డు మల్లె, టేకు చెక్కలతో అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ప్రేమ పేరుతో వంచనకు గురి చేసే మనిషి వికృత రూపాన్ని.. ఒకే మొద్దుకు ఇరువైపులా అద్భుతంగా చెక్కారు.
ఎంతో శ్రమించినా.. శ్రమకు తగ్గ ఫలితం రాకపోగా.. నష్టాన్ని చూస్తున్న రైతు ఆవేదనను కర్రపై కళ్లకు కట్టినట్టు సృష్టించారు. సుమారు 12 ముఖాకృతులను ఒకే కొయ్యపై చెక్కి ఔరా అనిపించారు. ఓపిక, సహనంతో పాటు.. సృజనాత్మకత ఉంటేనే ఈ రంగంలో రాణించగలరని సురేందర్ పేర్కొంటున్నారు. కళాకృతులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో కళాకృతి ఒక్కో జ్ఞాపకంగా మలిచిన సురేందర్‌ను సందర్శకులు అభినందిస్తున్నారు. కర్రలతో అరుదుగా తీర్చిదిద్దిన శిల్ప సౌందర్యాన్ని చూసేందుకు... సందర్శకులు అమితాసక్తి చూపుతున్నారు.