బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసిన ఓ రకం బియ్యంలో ఐరన్ శాతం అధికంగా ఉన్నట్టు... ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్సిటీ పరిధిలోని అనేక కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఎన్నో వరి వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘డబ్ల్యూజిఎల్1119’గా పిలిచే ఈ వంగడాన్ని ఈ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ బియ్యంలో ఐరన్ శాతం పుష్కలంగా ఉండడమే కాదు, వర్షాభావ పరిస్థితులున్నప్పుడు కూడా సాగు చేసేందుకు ఇది అనువుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
బయో బియ్యం అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు - తెలంగాణ తాజా వార్తలు
కొత్తగా బయోటెక్నాలజీ విధానంలో జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు 'డబ్ల్యూజిఎల్1119' బియ్యం రకాన్ని పండించారు. ఆ బియ్యంలో ఐరన్ శాతం అధికంగా ఉండటమే కాకుండా వర్షాభావ పరిస్థితులను సైతం ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు ఎకరానికి 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుందని వెల్లడించారు.
115 రోజుల స్పల్పకాలిక రకమైన దీని గింజ బీపీటీలా సన్నగా ఉండడమే కాక, ఉల్లికోడు తెగులును సైతం తట్టుకుంటుందని... ఎకరానికి 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుందని వారు చెబుతున్నారు. కిలో బియ్యంలో 21.03 మిల్లీగ్రాముల ఐరన్ ఉన్నట్టు కనుగొన్నామని ఈ పరిశోధనలో కీలకంగా పనిచేస్తున్న బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వై.హరి వివరించారు. రెండో సంవత్సరం చిరుసంచుల ప్రదర్శన దశలో ఉన్న ఈ వంగడం విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ రావుల ఉమారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:'వైరస్ సోకినా... వ్యాక్సిన్‌తో ప్రాణాపాయం తప్పుతుంది'