Saidu Galambi Plants Nursery In Warangal :వరంగల్‌కు చెందిన సైదు గాలింబికి మొక్కలంటే పంచప్రాణాలు. 26 ఏళ్ల నుంచి మొక్కల పెంపకాన్ని వ్యాపకంగానే కాదు వ్యాపారంగా ఎంచుకొని ఆదాయం పొందుతున్నారు. భూమి లీజుకు తీసుకొని తొలుత నర్సరీని(Nursery) మొదలుపెట్టి, ఇప్పుడు మూడింటికి విస్తరించారు. పచ్చదనం పరిచినట్టుగా ఉన్న ఆ నర్సరీలో 300 రకాల దేశీ, విదేశీ పూలు, పండ్ల, ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా మొక్కలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
నర్సరీలో కూలీలుగా మారిన పంచాయతీ కార్యదర్శులు
"మొక్కలంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రాణం. చెట్లను, మొక్కలను పెంచడం మా మామయ్య వల్ల నాకు అలవాటైంది. పూల, పండ్ల మొక్కలతో పెంపకం మొదలు పెట్టాం. ఎంతో ఇష్టంగా నర్సరీని షురూ చేశాం. ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, బహుమతులు ఇవ్వడానికి ఇలా రకరకాల మొక్కలను పెంచుతున్నాం. మిగతా నర్సరీలో దొరకని మెుక్కలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడే ఓ స్థలంలో చిన్న చిన్న చెట్లను పెంచుతున్నాం." - సైదు గాలింబి, నర్సరీ నిర్వాహకురాలు
అధ్యాపక వృత్తి వదిలి మొక్కల సంరక్షణలోనే : గతవర్షాకాలంలో వచ్చిన వరదలకు నర్సరీలలోని మొక్కలన్ని మునిగిపోయి కుళ్లిపోయి అపార నష్టం మిగిల్చింగని సైదు గాలింబి తెలిపారు. అయినా వెనకడుగు వేయలేదని చెప్పారు. మళ్లీ ఒక్కో మొక్క తెచ్చి నాలుగు నెలల్లోనే పచ్చటి నర్సరీలకు ప్రాణం పోశామని వెల్లడించారు. వాటిపై ప్రేమతో ఎక్కడికి వెళ్లకుండా నర్సరీల్లోనే ఉంటూ సంరక్షణ చూస్తున్నామని వివరించారు. కొనుగోలు చేసేవారికి బాగా ఎదిగేందుకు సూచనలు ఇస్తున్నామన్నారు. తన ఇద్దరు కుమారులు సైతం అధ్యాపక వృత్తి వదిలి మొక్కల సంరక్షణలోనే పూర్తి సమయాన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.