Demand for Mrigasira Karthi fishes :ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్తె తొలిరోజు చాలా స్పెషల్. ఈరోజున ప్రతి ఇంటా చేపల కూర ఘుమఘుమలు గుప్పుమంటాయి. చేపల ఫ్రై, చేపల పులుసు.. ఇలా రకరకాలుగా చేపల కూరను వండుకుని ఇంటిల్లిపాది కలిసి భోజనం చేస్తారు. చేపలంటే అంతగా ఇష్టం లేని వారు కూడా.. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయమని భావించి.. ఈరోజు ఓ చేప ముక్కను నోట్లో వేసుకుంటారు. ఇక ఈరోజు చేపల మార్కెట్లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి పట్టణాల్లో అయితే చేపల మార్కెట్లలో.. పల్లెల్లో అయితే చెరువుల దగ్గరకు తండోపతండాలు జనసందోహమే.
Rush at Fish Markets on Mrigasira Karthi : మృగశిర కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరమవుతాయని ముఖ్యంగాఆస్తమా రోగులకు ఈ రోజు చేపలులేక చేపమందు తింటే రోగం పూర్తిగా నయమవుతుందని ప్రజల నమ్మకం. అందుకే మార్కెట్లు, రైతు బజార్లలో చేపల కోసం జనాలు క్యూ కడుతున్నారు. తమకు ఇష్టమైన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. చెరువుల వద్ద ఏటు చూసినా జన సందోహమే కాగా, కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు. మృగశిర కార్తె సందర్భంగా వరంగల్ జిల్లాలోని చేపల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
కొంతమంది మార్కెట్లో చేపలు కొనుగోలు చేయకుండా.. డైరెక్టుగా చెరువుల వద్దకే వెళ్తున్నారు. అక్కడైతే తాజా తాజాగా చెరువులో నుంచి తీసుకొచ్చిన చేపలు అమ్ముతారని చాలా మంది అక్కడికే క్యూ కడుతున్నారు. వరంగల్ జిల్లాలోని పలు చెరువుల వద్ద మత్స్యకారులు చేపలు పట్టి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.