గుంతలు పడిన రహదారులు, కంకర తేలిన రోడ్లు... ప్రయాణం చేయలేక ప్రజలకు ఇబ్బందులు. ఎక్కడో అనుకుంటున్నారా...? కాకతీయుల రాజధాని ఓరుగల్లు మహా నగరంలో. ఇక్కడ ప్రధాన రహదారులన్నీ నరక ప్రాయంగా మారాయి. పలు చోట్ల అధ్వాన్నంగా తయారైన రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.
అభివృద్ధి పేరిట అధ్వాన్నం
జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న రహదారులను మరమ్మతుల పేరిట అధికారులు తవ్వించి వదిలేశారు. నామమాత్రంగా కంకర పోసి చేతులు దులుపుకున్నారు. ఆరెపల్లి, పైడిపల్లి గ్రామాలను కలిపే దేశాయిపేట రహదారిపై ప్రయాణం చేయాలంటేనే నగర వాసులు జంకుతున్నారు. అంతర్గత రహదారి అయినప్పటికీ భారీ వాహనాల రాకతో పూర్తిగా దెబ్బతిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కమిషనర్ శృతి ఓఝా చొరవతో వీటిని నిలిపివేసినప్పటికీ... కమిషనర్ బదిలీతో పెద్ద వాహనాల రాకపోకలు యథావిథిగా మొదలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రహదారులపై ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.