Revanth Reddy Vijayabheri Sabha in Warangal District : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధిబాటవైపు నడవాల్సిన యువతను.. నిరుద్యోగులుగా(Unemployed) మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
Congress Election Campaign in Telangana :స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రితో పాటు డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియమ్మ(Sonia Gandhi) మనకు తెలంగాణ ఇచ్చారని.. అటువంటి పార్టీకి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు.
'కరెంట్, రైతుబంధుపై- కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు'
రాష్ట్రంలో బూటకపు పాలన నడుస్తుందని విమర్శించిన రేవంత్ రెడ్డి.. బిల్లులు రావట్లేదని ఆవేదన చెందిన సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటామని తెలిపినట్లు వివరించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి(Errabelli Dayakar Rao).. బీరు సీసాలు అమ్ముకుని బిల్లులు కట్టుకోవాలనటం దారుణమన్నారు. యువకులకు ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ సమాజానికి అన్నివిధాలుగా నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం.. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని రేవంత్ రెడ్డి ఆశావహం వ్యక్తం చేశారు.