ఈ వీడియోలో చిన్నారులతో కలిసి ఉన్న అతని పేరు భాస్కర్. వరంగల్ అర్బన్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన భాస్కర్ కొంతకాలంగా శ్మశాన వాటికలో తన ముగ్గురు చిన్నారులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కూరగాయల మార్కెట్ వద్ద వారసత్వంగా వచ్చిన ఇల్లుండేది. కానీ అది శిథిలావస్థకు చేరి ఒక్కసారిగా కూలిపోయింది. అంతే అప్పటి నుంచి భాస్కర్ దళిత శ్మాశాన వాటికలోనే నివసిస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందులే కారణం
ఇటీవలే భార్య అనారోగ్యంతో కాలం చేసిందని.. ఎక్కడికి పోవాలో దిక్కుతోచక తన చిన్నారులతో కలిసి శ్మశానంలో సేదతీరుతున్నానని చెప్పాడు. కూలీ చేసి పిల్లలను పోషిస్తున్నానని తెలిపాడు. పెద్ద కుమార్తె జయశ్రీని 8వ తరగతి వరకు చదివించగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాల మానేసిందన్నాడు. కుమారుడు జయరాజ్ స్థానిక పాఠశాలలో చదువుతుండగా.. చిన్న కూతురు గౌతమి లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తోందన్నాడు.