తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్చికి భలే గిరాకీ.. సింగిల్‌ పట్టి రకానికి రికార్డుస్థాయిలో పెరిగిన ధర

Mirchi Price: సీజన్‌ ఆరంభంలో15వేలు.. ఇప్పుడు ఏకంగా 40 వేలు.. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సింగిల్‌ పట్టి మిర్చికి పలుకుతున్న ధర ఇది. మరో వారం, పది రోజుల్లో.. 50 వేల రికార్డు ధర నమోదయ్యే అవకాశం ఉంది. మిరపకు గతంలో ఎప్పుడూ లేనంతగా ధర పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. తామర తెగులు, ప్రకృతి విపత్తు వల్ల.. దిగుబడి గణనీయంగా తగ్గిందని వాపోతున్నారు.

మిర్చికి భలే గిరాకీ.. సింగిల్‌ పట్టి రకానికి రికార్డుస్థాయిలో పెరిగిన ధర
మిర్చికి భలే గిరాకీ.. సింగిల్‌ పట్టి రకానికి రికార్డుస్థాయిలో పెరిగిన ధర

By

Published : Mar 14, 2022, 3:17 AM IST

Updated : Mar 14, 2022, 4:53 AM IST

మిర్చికి భలే గిరాకీ.. సింగిల్‌ పట్టి రకానికి రికార్డుస్థాయిలో పెరిగిన ధర

Mirchi Price: వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఎర్రబంగారంతో కళకళలాడుతోంది. వివిధ ప్రాంతాలనుంచి రైతులు తీసుకొస్తున్న మిర్చి క్రయ విక్రయాలతో మార్కెట్ పరిసరాలు సందడిగా మారుతున్నాయి. నెల రోజుల నుంచి మిర్చిధర క్రమంగా పెరుగుతుండగా.. సింగిల్ పట్టి రకం మిరపకు రికార్డు స్థాయిలో 37 వేల నుంచి 42 వేల వరకు వస్తోంది. వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువగా పండించే ఈ రకానికి మంచి డిమాండ్‌ ఉంది. సింగిల్‌ పట్టి రకం మిరపకు.. మంచి రంగు, ఘాటు తక్కువగా ఉండడం, పచ్చళ్లకోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. గత నెలలో 20 వేల వరకు పలికిన ఆ రకం మిర్చి.. ఇప్పుడు క్వింటాకు 42 వేలు పలుకుతోంది. రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో 50 వేల ధరకు చేరే అవకాశం ఉందని.. మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వండర్‌హాట్, తేజా రకాలకూ మంచి ధర వస్తోంది. ప్రస్తుతం వండర్‌ హాట్ మిర్చి క్వింటాకు 23వేలకుపైగా ఉండగా.. తేజారకం 17 వేల వరకూ పలుకుతోంది.
గణనీయంగా తగ్గిన దిగుబడి
ధర భారీగా ఉన్నా దిగుబడి తగ్గిందన్న ఆవేదన రైతుల్లో అధికంగా ఉంది. ఈ సారి మిరపకు తామర పురుగు ఆశించడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. వాటికి తోడు అకాలవర్షాలు, వడగండ్లు రైతులకు కడగండ్లను మిగిల్చాయి. ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సిన పంట.. నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమైంది. పురుగు మందులు అధికంగా చల్లడంతో పెట్టుబడి ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. దిగుబడి తగ్గడం వల్ల లాభం లేకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
కొందరు వ్యాపారులు నాణ్యత లేదన్న సాకుతో తక్కువ ధరకే కొంటున్నారని రైతులు చెబుతున్నారు. సింగిల్‌ పట్టిరకం క్వింటాల్‌ ధర 50 వేలకు చేరుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 14, 2022, 4:53 AM IST

ABOUT THE AUTHOR

...view details