తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాలతో ఓరుగల్లు విలవిల.. రికార్డు స్థాయి వరదతో కాళేశ్వరం కళకళ - కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద

Warangal floods : ఎడతెరపిలేని వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలోని చాలా గ్రామాలకు రాకపోకలు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో అక్కడి ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలరచేతిలో పట్టుకుని.... కాలం గడుపుతున్నారు. గోదావరి ఉప్పొంగుతుండటంతో.... అధికారులు ముంపు గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Warangal floods
Warangal floods

By

Published : Jul 14, 2022, 11:38 AM IST

Warangal floods : వారం రోజులుగా వరణుడి ప్రతాపంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊళ్లు ఏర్లుగా మారిపోతున్నాయి. ప్రాణహితతో కలసి గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో.... పుష్కరఘాట్లు, దుకాణాలు మునిగిపోయాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్భందనంలోనే కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. పెంకవాగు ఉధృతితో వెంకటాపురం మండలంలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తిప్పాపురం, కొతగుంపు, పెంకవాగు, కలిపాక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో... ట్రాక్టర్లు, పడవల ద్వారా అధికారులు నిత్యావసర సరకులను తరలించారు.

త్రివేణి సంగమంలో రెడ్ అలెర్ట్..తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం, మహాదేవపూర్ గోదావరి పరివాహక ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. సాధారణ, వీఐపీ పుష్కర ఘాట్లను వరద ముంచెత్తింది. పుష్కర ఘాట్లపై నుంచి వరద ఉప్పొంగి సమీప దుకాణాలు, ఇళ్లలోకి చేరింది.

రికార్డు ప్రవాహం..కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద ప్రవాహం పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మొదటి సారి భారీ వరద రికార్డు స్థాయిలో నమోదైంది. గతేడాది జులై 23న 11,62,000 క్యూసెక్కుల వరద రికార్డు ఉండగా ఈసారి రికార్డును తిరగ రాసింది. లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి తొలిసారిగా భారీగా 22,15,760 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. మేడిగడ్డలో 85 గేట్లకు గాను 85 గేట్లు తెరిచి వరద నీటిని వదులుతున్నారు. సరస్వతీ (అన్నారం) బ్యారేజీలో 66 గేట్లకు గాను 66 గేట్లు ఎత్తారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 1477975 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1477975 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బయటకురావొద్దు..ములుగు జిల్లా మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారంలోని గోదావరి ఉద్ధృతిని జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల చర్యలపై అధికారులకు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు తగ్గేవరకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని.... రోడ్ల మీదకు రావద్దని సూచించారు.

ఉద్ధృతంగా చలివాగు.. హనుమకొండ జిల్లా పరకాల రెవిన్యూ డివిజన్ వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. పరకాల చలివాగులోకి వరదనీరు పెరగడంతో చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల పత్తి, కూరగాయల పంటల్లోకి భారీగా వరద నీరు చేరడంతో పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. నడికూడ మండలం కంటత్మకూరు గ్రామ శివారులో వాగు ఉద్ధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జయశంకర్ జిల్లా అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జనం విలవిలలాడుతున్నారు. గోదావరి ఉగ్రరూపంతో గోదావరి పరివాహక ప్రాంతంలో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మహాదేవపూర్, పలిమేల, కాటారం మండలంలో పరిస్థితి భీభత్సంగా మారింది. గోదావరి ఉగ్ర రూపంతో ఆయా మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో సామగ్రి చేతబట్టి తరలివెళ్తున్నారు. మహదేవపూర్ మండలం పెద్దంపేట, అన్నారం, చండ్రుపల్లి, నాగపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, కన్నెపల్లి, బీరా సాగర్, పూస్కుపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. పలిమేల మండలంలో 15 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. విద్యుత్, వైద్యం, రవాణా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాటారం మండలం దామెరకుంట గ్రామంలోకి వరద రావడంతో ప్రజలు ఎడ్ల బండ్లలో పునరావాస కేంద్రానికి తరలి వెళ్లారు.

వాగులో పడ్డారు.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల పెద్దం చెరువు లో లెవల్ వంతెన వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా ఓ ద్విచక్ర వాహనదారుడు వాగు దాటడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాగులో పడిపోవడంతో అతణ్ని రక్షించేందుకు ప్రయత్నించి మరో వ్యక్తి కూడా వాగులో పడిపోవడంతో గమనించిన స్థానికులు వారిద్దరిని రక్షించారు. ద్విచక్రవాహనం వాగులో కొట్టుకుపోయింది. వెంటనే చెన్నారావుపేట పోలీసులు ప్రవాహం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని మూసివేసి పహారా కాస్తున్నారు.

ముంపు బాధితుల కోసం ములుగు జిల్లాలో 21 , భూపాలపల్లి జిల్లాలో 17 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లా యత్నారానికి చెందిన ఓ యువతి అనారోగ్యానికి గురవటంతో... పడవలో ఆస్పత్రికి తరలించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వరద బాధితులను కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాల్లోని పలుఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడుబావుల జలపాతం వద్ద ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వరంగల్ జిల్లా గురిజాలలో వాగుదాటుతూ కొట్టుకుపోయిన ఓ ద్విచక్రవాహనదారుడిని స్థానికులు కాపాడారు. వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో 4 ఇళ్లు నేలమట్టమయ్యాయి. హనుమకొండ జిల్లా మైలారంలోనూ ఓ వ్యక్తి ఇల్లు నేల కూలింది.

ABOUT THE AUTHOR

...view details