Ramappa Temple UNESCO Deadline is Comingsoon : అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామా ఏదంటే.. క్షణం ఆలోచించకుండా చెప్పేది మన రామప్పే(Ramappa Temple)నని. ములుగు జిల్లా పాలంపేటలో కాకతీయరాజు (Kakatiya)ల హయంలో నిర్మించిన ఈ ప్రాచీన దేవాలయం.. సుందరమైన ఆకృతులకు నిలయం. ఎన్నో ప్రత్యేకతల సమాహారం. శాండ్ బాక్స్ సాంకేతికత(Sand Box Technology), నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం.. సహజత్వాన్ని పోలిన విధంగా కనిపిస్తూ మదిని దోచే శిల్పాలు.. సరిగమలు పలికే శిలలున్న ఈ దేవాలయం విశిష్టత, మాటల్లో చెప్పలేం. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే ప్రపంచ వారసత్వ సంపదగా మిగతా వాటిని పక్కకునెట్టి.. మన రామప్ప యునెస్కో(UNESCO) గుర్తింపు పొందింది.
ఈ హోదాతో రామప్ప ఖ్యాతి జగద్విఖ్యాతమైంది. ఈ గుర్తింపు ఒక్కరోజులోనో ఒక్కరి వల్లనో వచ్చింది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పురావస్తు శాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు.. అందరూ పట్టుదలగా సంకల్పించిన కృషి ఫలితంగా రామప్ప దేవాలయానికి ఈ అపురూప హోదా దక్కింది. ఆలయ ప్రత్యేకతలతో డోసియర్‌ను తయారు చేసి యునెస్కోకు అందించారు. ఆ తర్వాత కూడా యునెస్కో ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు 18 దేశాల మద్దతుతో 2021 జులై 25న రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కింది.
RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు
Ramappa Temple is Recognized by UNESCO : ఈ గుర్తింపు రావడానికి చేసిన కృషి, పడిన శ్రమ.. హోదాను కాపాడుకోవడంలో కనిపించట్లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. యునెస్కో అడిగిన నివేదికలను పంపించే గడవు దగ్గరకొస్తున్న విషయమే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. గుర్తింపు దక్కిన తర్వాత యునెస్కో విధించిన షరతుల ప్రకారం కట్టడాల సంరక్షణ, పర్యాటకుల సౌకర్యాలు, సరిహద్దులు, తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. రుద్రేశ్వర ఆలయం, ఇతర ఉపాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించాల్సిన పాత్ర, బాధ్యతలు బఫర్ జోన్ హద్దులు తదితర సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో యనెస్కోకు ఇవ్వాలి.