గత వారం రోజులు ఆగకుండా కురిసిన వర్షాలు మధ్యలో ఒకరోజు కాస్త విరామం ఇచ్చి మళ్లీ మొదలయ్యాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. హన్మకొండ, వరంగల్, కాజీపేట రహదారులన్నీ జలమయం అయ్యాయి. హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో పది సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. కమలాపూర్‌లో 8 సెం.మీ, హసన్‌పర్తిలో 7 సెం.మీ, ధర్మసాగర్లో 5 సెం.మీ మేర వర్షం కురిసింది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం కుండపోత వర్షం పడింది. ఆగకుండా కురిసిన వర్షాలతో నర్సంపేటలో ఓ ఇల్లు కూలగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆగని వాన.. ఉమ్మడి వరంగల్ జలమయం! - నీట మునిగిన వరంగల్
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హన్మకొండ, వరంగల్, కాజీపేటల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. మోకాలి లోతుకు పైగా వర్షపునీరు రహదారులపైకి వచ్చింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సైతం భారీ వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. సోమవారం వరకు ఉద్ధృతంగా ప్రవహించిన వాగులు.. కాస్త శాంతించి.. బుధవారం పడిన వర్షాలకు మరోసారి ఉప్పొంగుతున్నాయి. వాజేడు మండలం పేరూరు వద్ద.. గోదావరి నీటిమట్టం పెరుగుతూ 42 అడుగులకు చేరుకుంది. వెంకటాపురం మండలం పెంకవాగు మళ్లీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్తగుంపు, కలిపాక, పెంకవాగు, తిప్పాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 30 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. వెంకటాపూర్ మండలం మీదుగా పరకాల వెళ్లే పాలెంపేట రహదారిపై రామప్ప చెరువు మత్తడి దూకుతున్నది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రామప్ప సరస్సు ఎగువ భాగంలోని పాపయ్యపల్లి, సింగరకొండపల్లి గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన మత్స్యకారులు మేడివాగులో చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి ఆచూకికోసం పోలీసులు, స్ధానికులు గాలిస్తున్నారు. ఇటు మహబుబాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. పాకాల, వట్టివాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కేసముద్రం నుంచి గూడూరు, నెక్కొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీ చూడండి:'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'