దేశంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన రైల్వేని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రైల్వే సంఘాల నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ ముందు మజ్దూర్ సంఘం నాయకులు, ఉద్యోగులు జెండాలు చేతబూని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ఒక వ్యాపార సంస్థగా చూస్తూ... 150 రైళ్లు, 100 స్టేషన్లు, 109 రైల్వే రూట్లను, విలువైన రైల్వే భూములను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చూడడం హేయమైన చర్య అని వారు అన్నారు. తమ ఉద్యోగ భద్రతకు పెను ప్రమాదంగా మారిన రైల్వే ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని.... లేకపోతే తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైల్వే ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని నిరసన
రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట రైల్వే సంఘాల నాయకులు, ఉద్యోగులు నిరసన తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ అయిన రైల్వేను ప్రైవేటీకరించడాన్ని తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైల్వే ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని నిరసన
ఇది రైల్వే రంగ సమస్య మాత్రమే కాదని... దేశ ప్రజలందరి సమస్యని అన్నారు. రైల్వే ప్రభుత్వ సంస్థగా ఉంటేనే వృద్ధులు, వికలాంగులు, సామాన్య పౌరులకు ప్రయాణం కోసం కల్పించే రాయితీలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. సామాన్య పౌరులు, మేధావులు రైల్వే ప్రైవేటీకరణపై స్పందించి ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు