Rahul Gandhi Public Meeting రాష్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే - కులగణన చేపడతాం Rahul Gandhi Election Campaign in Telangana: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వం వరుస కట్టగా.. ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చేరుకున్నారు. పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించిన రాహుల్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. కేసీఆర్ చదువుకున్న పాఠశాల, కళాశాల కట్టిందే కాంగ్రెస్ అన్నారు.
Rahul Gandhi Comments on BRS : రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం జరుగుతోందని రాహుల్ గాంధీ(Rahul Gandhi Tour) ఆరోపించారు. మీరంతా ప్రజల తెలంగాణ స్వప్నాన్ని చూడాలనుకుంటే.. మీ ముఖ్యమంత్రి మాత్రం ఒక కుటుంబ స్వప్నాన్ని నెరవేర్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) అవినీతి తెలంగాణలో ఎక్కడికెళ్లినా కనిపిస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిస్థితిని తన కళ్లతో చూశానని తెలిపారు. రూ.లక్ష కోట్లను దోచుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల నుంచి ఎంత దోచుకున్నాడో.. ప్రతిపైసా లెక్కతీసి, తెలంగాణలోని పేద ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు - ఈసారి ప్రజా సర్కారు రావడం ఖాయం : రాహుల్ గాంధీ
Rahul Gandhi Road Show in Narsampet : అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. రాహుల్ రోడ్‌షోకు నియోజవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను మొదటి మంత్రివర్గ భేటీలోనే తమ ప్రభుత్వం అమలు చేస్తుందని రాహుల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి.. కంప్యూటరీకరణ అంటూ 2 లక్షల మంది రైతులకు చెందిన భూములను లాక్కున్నారని రాహుల్ మండిపడ్డారు. మంత్రివర్గంలో బాగా ఆదాయం వచ్చే శాఖలను ముఖ్యమంత్రి తన కుటుంబసభ్యులకు కేటాయించారని అన్నారు. దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని.. కాంగ్రెస్ హయాంలో బడుగు, బలహీనవర్గాల పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
'కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశా, ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడింది'
Rahul Gandhi Padayatra in Warangal: నర్సంపేట పర్యటన అనంతరం వరంగల్ నగరానికి బయలుదేరిన రాహుల్‌గాంధీ.. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేశారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు(Congress Leaders) కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు, వేలాదిగా తరలివచ్చిన జనంతో కలిసి ఓరుగల్లు నగరంలో రాహుల్ ముందుకు సాగారు. పోచమ్మ మైదానం నుంచి రుద్రమదేవీ కూడలి వరకు పరిసరాలు జన సందోహంగా మారాయి. రుద్రమదేవి కూడలిలో ప్రజలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను పెకిలించటమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
"కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ముఖం ఒక్కటే. మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా రూ.2500 వేస్తాం. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం. విద్యార్థుల చదువు, కోచింగ్ కోసం యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తాం. చేయూత పథకం వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా రూ.4 వేలు ఇస్తాం. తెలంగాణ ఇస్తే.. పేదలకు మేలు జరుగుతుందని భావించాం. కానీ అలా జరగలేదు. మేము గెలవగానే కులగణన చేపట్టి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం."- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే : దేశానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని రాహుల్ జోస్యం చెప్పారు. ఒక ధర్మానికి, మరో ధర్మానికి మధ్య చిచ్చుపెడతారని.. ఒక జాతికి మరో జాతికి మధ్య పంచాయితీ పెడతారని వివరించారు. ఇది విద్వేషాల రగిల్చే దేశం కాదని.. ప్రేమను పంచే దేశమని తెలిపారు. మా పోరాటం బీజేపీ(BJP), బీఆర్ఎస్తో జరుగుతోందని.. ఆ రెండు పార్టీలు ఒకే శక్తులని అన్నారు. ఒకరు దిల్లీలో.. మరొకరు తెలంగాణలో పని చేస్తుంటారని విమర్శించారు. గతంలో ఇక్కడి బీజేపీ నేతలు ఛాతిని ఎత్తి తిరుగుతుండేవారని.. 15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వారి గాలి తీసేసిందని పేర్కొన్నారు. మోదీ వాహనం 4 టైర్లు పంక్చరయ్యాయని అన్నారు. ఇకపై వారు తెలంగాణ వైపు కన్నెత్తి చూడరు కానీ.. వెనక నుంచి కేసీఆర్‌కు మద్దతిస్తారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ను తెలంగాణ నుంచి తరిమికొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు.
Rahul Gandhi Comments on BJP : 2024లో దిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించటమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ పంచాయతీరాజ్(PANCHAYATHI RAJ) విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని.. ఓబీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచితే.. తెలంగాణలో 24 వేల మంది కొత్తతరం నాయకులు స్థానిక సంస్థల్లో వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తాజా పర్యటన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, అభ్యర్థుల్లో జోష్ నింపింది. శనివారం నుంచి పోలింగ్ వరకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రాష్ట్రానికి వరుస పర్యటనలు ఉండటంతో ఆ పార్టీ మరింత జోరుగా ప్రచారం సాగించనుంది.
'జోడో యాత్ర తర్వాత నన్ను తలచుకుని మోదీ, కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారు'
కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ