తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగి పడేసిన బోండాలతో సేంద్రియ ఎరువు.. ఎక్కడో తెలుసా..? - వ్యర్థాలతో అద్భుతాలు

‘వ్యర్థాల శుద్ధీకరణపై గ్రేటర్‌ వరంగల్‌ దృష్టి సారించింది. తాగి పడేసే కొబ్బరి బోండాల ద్వారా సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టింది. ఈమేరకు హన్మకొండ బాలసముద్రం నర్సరీ కేంద్రం ఆవరణలో ఒక యంత్రాన్ని నెలకొల్పగా రెండు నెలలుగా విజయవంతంగా అమలవుతోంది. సేంద్రియ ఎరువు ప్రధాన రహదారుల్లోని సెంట్రల్‌ డివైడర్ల మొక్కలు, గ్రీనరీకి వినియోగిస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ నగరంలో ఇంటింటా పోగవుతున్న పొడి చెత్తను డీఆర్సీ సెంటర్లకు విధిగా తరలించేలా ప్రణాళిక రూపొందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 పోటీలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు బల్దియా అధికారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు.’

Preparation of organic manure with drunken coconut
Preparation of organic manure with drunken coconut

By

Published : Sep 29, 2020, 2:34 PM IST

వరంగల్‌ త్రినగరాల్లోని పలు ఖాళీ స్థలాల్లో తాగేసి పడేసిన కొబ్బరి బోండాలు దర్శనమిస్తున్నాయి. భద్రకాళి, ములుగురోడ్‌ కోట చెరువు, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి, ఉర్సు రంగసముద్రం, కాజీపేట బంధం చెరువు, కాకతీయ కాలువ పరిసరాల్లో ఇష్టానుసారంగా వాటిని పడవేస్తున్నారు. రాంపూర్‌ డంపింగ్‌ యార్డులో గుట్టల్లా పేరుకుపోయాయి. కొబ్బరి బోండాల్లో నీరు నిలిచి ఉండటంతో దోమల ఉద్ధృతి పెరుగుతోంది.

వరంగల్‌ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. దేశాయిపేట, డాక్టర్స్‌ కాలనీ, పెద్దమ్మగడ్డ కాకతీయ కాలువ వైపు వాకింగ్‌ చేసే వారు సమస్య తీవ్రతను వీడియో క్లిప్పింగ్‌లు గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతికి పంపించారు. ఈ సమస్య పరిష్కరించేందుకు ఆమె కొత్త ఆలోచన చేశారు. విజయవాడ నుంచి రూ.2 లక్షలతో కొబ్బరి బోండాల కటింగ్‌ మిషన్‌ తెప్పించారు. బాలసముద్రం నర్సరీలో ఏర్పాటు చేశారు. ఆ యంత్రం గంటకు 1200 బోండాలు కట్‌ చేస్తుండగా యంత్ర సహాయంతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. వరంగల్‌ త్రినగరాల్లో సుమారు 150 దుకాణాలుంటాయి. తాగేసిన కొబ్బరి బొండాలు బయట పడేయకుండా ప్రత్యేక వాహనాల ద్వారా వ్యాపారులే తీసుకొస్తున్నారు. ఒక్కటే మిషన్‌ ఉండడంతో బోండాలు కట్టింగ్‌ ఆలస్యమవుతోంది. నాలుగు రోజుల కిందట కమిషనర్‌ పరిశీలించగా మరో రెండు మిషన్లు కొనుగోలు చేయాలని అధికారలును ఆదేశించారు. మూడు మిషన్లు అందుబాటులోకి రాగానే కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ మూడు ప్రాంతాల్లో కొబ్బరి బోండాల శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

మరో రెండు కొనుగోలు చేస్తాం

బాలసముద్రం నర్సరీలో ఒకే మిషన్‌తో కొబ్బరి బోండాలు కట్‌ చేస్తున్నారు. కొత్తగా మరో రెండు మిషన్లు కొనుగోలు చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. విజయవాడ నుంచి మరో రెండు యంత్రాలు తెప్పిస్తాం. కాజీపేట, వరంగల్‌ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం.- లక్ష్మారెడ్డి, ఈఈ, గ్రేటర్‌

ABOUT THE AUTHOR

...view details