Police Produced Bandi Sanjay in Court : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో అరెస్టు అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో హనుమకొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను పోలీసులు హనుమకొండ కోర్టు వెనుక ద్వారం నుంచి తీసుకెళ్లారు. అంతకుముందు బండి సంజయ్‌కు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
పోలీసు వాహనం చెప్పలు విసిరిన దుండగులు :తమను కోర్టులోకి వెళ్లనివ్వాలంటూ సంజయ్ తరఫు లాయర్లు హనుమకొండ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు కోర్టు ప్రాంగణం గేటుకు తాళాలు వేశారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో బండి సంజయ్ తరఫు న్యాయవాదులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలకుర్తి నుంచి బండి సంజయ్‌ను కోర్టుకు తరలిస్తున్న పోలీసు వాహనంపై హనుమకొండ కోర్టు చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.