YS Sharmila arrest: రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తుందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మిగతా అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తుంటే.. ప్రజల పక్షాన పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని అన్నారు. రేయింబవళ్లు ప్రజల కోసం కొట్లాడుతుంటే ఓర్వలేక అరెస్ట్ చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో ఉన్న బస్సును తగలబెట్టారని దుయ్యబట్టారు.
అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నా.. శాంతిభద్రతల సమస్య సృష్టించి తన పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. పోలీసులను వాడుకుని తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న జరిగిన సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు .. ఈరోజు వైఎస్సార్టీపీకి చెందిన ఫ్లెక్సీలను చింపివేశారు. షర్మిల పాదయాత్రలో ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులకు వైఎస్సార్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇదే విషయమై పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతలకు విఘాతం దృష్ట్యా షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.