Arrangements of PM Modi Warangal Tour :రాష్ట్రంలో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణపై దృష్టి సారించారు. పలు దఫాలుగా వాయిదా పడుతున్న మోదీ పర్యటన ఎట్టకేలకు ఫైనల్ కావడంతో.. రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధాని ఈ నెల 8న వరంగల్‌కురానుండటంతో ఏర్పాట్లు చకచకా జరగుతున్నాయి. ఉదయం సికింద్రాబాద్ హకీంపేట్ విమానాశ్రయం నుంచి వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి.. అక్కడి నుంచి నేరుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
Prime Minister Narendra Modi visit to Warangal :మోదీ రాకను పురస్కరించుకుని మామునూరు విమానాశ్రయంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ముందుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని.. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. కాజీపేట అయోధ్యాపురంలో 160 ఎకరాల్లో నెలకొల్పనున్న రైలు వ్యాగన్ తయారీ పరిశ్రమకు మోదీ శంకుస్థాపన చేస్తారు. రూ.500 కోట్ల వ్యయంతో.. అధునాతన, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ వ్యాగన్ పరిశ్రమలో నెలకు 200 వరకు వ్యాగన్లు తయారవుతాయి.
PM Modi Visits Telangana :రూ.5,550 కోట్ల విలువైన పలు జాతీయ రహదారులకు ప్రధాని ఇదే కార్యక్రమంలో శంకుస్థాపన చేయనున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య 68 కిలోమీటర్ల మేర జాతీయ రహాదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించే ప్రాజెక్టుకు.. మంచిర్యాల-వరంగల్ మధ్య జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారుల నిర్మాణంతో వరంగల్, కరీంనగర్ రహదారిపై మధ్య ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. వరంగల్-మంచిర్యాల మధ్య 34 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.
శంకుస్థాపనల అనంతరం.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. తొలిసారిగా వరంగల్‌కు మోదీ రానుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు సభకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ నుంచి.. భారీగా జన సమీకరణ చేసేందుకు కాషాయ నేతలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. నియోజకర్గాల పార్టీ నాయకులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. ఇక ప్రధాని రాకను పురస్కరించుకుని నిర్వహించే సభ కోసం మైదానంలో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే తనిఖీలు విస్తృతం చేశాయి. వరంగల్ పర్యటన ముగించుకుని ప్రధాని మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తారు.