వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న మూడో లైన్ విస్తరణ పనులతో తమ ప్రాంతానికి దారి లేకుండా అవుతుందని 36 వ డివిజన్ బోడగుట్ట ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ వెళ్లి ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు.
ఇదీ సంగతి
బోడగుట్ట ప్రాంత వాసులు కాజీపేట్కి వెళ్లడానికి స్టేషన్కి ఆనుకోని ఉన్న రైల్వే లైనే ప్రధాన మార్గం. నడక, ద్విచక్ర వాహనాల ద్వారా వీరు రాకపోకలు సాగించేవారు. మరో మార్గం ద్వారా కాజీపేట చేరుకోవాలంటే కనీసం 3 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రైల్వే లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఆ భూమిని చదును చేసి లోతుగా మట్టి తీయడంతో స్థానికులు రాకపోకలకు అంతరాయం కలిగింది. తమ సమస్య పరిష్కారం కోసం రైల్వే లైన్ మీద నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు పట్టాలపై నుంచి నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు.