తెలంగాణ

telangana

ETV Bharat / state

PROBLEMS WITH RAINS: కునుకు లేకుండా చేస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు..! - heavy rains in telangana

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపిలేని వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వానల వల్ల పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. వాగులు దాటే ప్రయత్నాలు చేసి పలువురు ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం పడినా.. తమకు మాత్రం కష్టాలు తప్పడం లేదని వరంగల్​ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PROBLEMS WITH RAINS: కునుకు లేకుండా చేస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు..!
PROBLEMS WITH RAINS: కునుకు లేకుండా చేస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు..!

By

Published : Aug 31, 2021, 4:17 PM IST

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా.. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.

PROBLEMS WITH RAINS: కునుకు లేకుండా చేస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు..!

వరదముంపులో ఓరుగల్లు

వర్షాలు వరంగల్‌ వాసులకు మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హంటర్ రోడ్డులోని బృందావన కాలనీ, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత నగర్ కాలనీల్లో వరద నీరు నిలిచింది. కట్టమల్లన్న చెరువు నుంచి వరదనీరు పెద్ద ఎత్తున రావడంతో శివనగర్, ఎనుమాముల లక్ష్మీ గణపతి కాలనీ, సాయినగర్, మధుర నగర్ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఖమ్మం బైపాస్ రోడ్డులోని రాజీవ్‌కాలనీ పూర్తిగా నీట మునగడంతో వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది.. బాధితులను హంటర్ రోడ్డులోని సంతోషిమాత గార్డెన్‌కు తరలించారు.

నీట మునిగిన కాలనీవాసులకు వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అక్షయపాత్ర ద్వారా భోజనం అందిస్తున్నారు. గతేడాది ఇదే తరహాలో వర్షాలు పడటంతో ఓరుగల్లు నగరం అతలాకుతలమైనా.. అధికారులు చర్యలు చేపట్టలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం రాగానే ఖాళీ చేయించి భోజనం అందించడమే తప్ప.. శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరవళ్లు తొక్కుతోన్న మోయ తుమ్మెద వాగు..

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మోయ తుమ్మెద వాగు పరవళ్లు తొక్కుతోంది. పలు గ్రామాల్లోని వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. హన్మకొండ-సిద్దిపేట ప్రధాన రహదారిపై బస్వాపూర్ వద్ద కల్వర్టు పైనుంచి మోయతుమ్మెద వాగు పొంగిపొర్లుతున్నందు వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కోహెడ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఇందుర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వింజపల్లి, వరికోలు ప్రాంతంలోని రెండు కుంటలు ప్రవహించడం వల్ల వరికోలు, రాంచంద్రపూర్, ఎర్రగుంటపల్లి, సామార్లపల్లి నుంచి కోహెడకు.. వింజపల్లి నుంచి పైగ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అవసరమైన చోట కల్వర్టులు, వంతెనలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

నీట మునిగిన పంటలు..

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతె మండలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పోస్తున్నాయి. నామవారం పెద్ద చెరువు మత్తిడి పోయడంతో నామవారం-గుంజలూరు ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మావిళ్లగూడెంలో వర్షం దాటికి వైకుంఠదామం జల దిగ్బంధం అయింది. విభలపురం వద్ద గండ్ల చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. రాఘవపురం వద్ద ఎస్సారెస్పీ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నేరేడువాయి, ఉర్లుగొండ, తుమ్మగూడెం, నామవరం, నర్సింహపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

ఇళ్లలోకి వరద నీరు..

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుబీర్ మండల కేంద్రంలోని మేదరివాడ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. బాధితులను గ్రామ పంచాయతీకి తరలించారు. వారికి రాత్రి అక్కడే బస ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

పాఠశాలల ప్రాంగణంలోకి నీరు..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటవీ శాఖ కార్యాలయం ఎదుట భారీగా నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. బస్టాండ్​లో నీరు నిల్వడంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా కొన్ని పాఠశాలల ప్రాంగణంలో మళ్లీ నీరు చేరింది.

బాలిక గల్లంతు..

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి వెల్లిన బాలిక నదిలో గల్లంతైంది. గోదావరి నది వద్ద ప్రీతి అనే బాలిక బట్టలు ఉతికి స్నానం చేస్తుండగా.. కాలుజారి పడిపోయిందని తల్లి సుశీల తెలిపారు. గోదావరిలో కొట్టుకుని పోతున్న కూతురిని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి స్థానిక జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది.

నిలిచిన రాకపోకలు..

మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. నిజాంపేట మండలంలో సోమాజి చెరువు మత్తడి పోస్తోంది. చల్మెడ నుంచి నిజాంపేట వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట తహసీల్దార్, అగ్నిమాపక కేంద్రం కార్యాలయాలు జలమయం అయ్యాయి.

ఇదీ చూడండి: weather report: రానున్న మూడు రోజులు వర్షాలే..!

ABOUT THE AUTHOR

...view details