Telangana private schools fees: అధిక ఫీజులు వసూల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని హనుమకొండ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు.. బుధవారం ఆందోళనకు దిగారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో లాక్డౌన్లో పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పాత ఫీజులు కడితేనే కొత్త ఆన్లైన్ తరగతులు పెడతామని వేధిస్తున్నారని వాపోయారు. నియంత్రణ కరవై అందినకాడికి డబ్బులు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యాల జులం ఎక్కువైందని.. వాటిని నియంత్రించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అయినా చెల్లించాలి
ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని ఏకశిల ఈ టెక్నో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం(fees harassment in private schools).. ఆన్లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు ఇవ్వాలని విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఆన్లైన్ క్లాసులు విన్నా, వినకపోయినా డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదని కరోనా దృష్ట్యా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమను అధిక ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఫీజుల భారం తమ వల్ల కాదని.. టీసీ ఇవ్వమన్నా.. డబ్బులు చెల్లించే వరకు టీసీ ఇవ్వడం కుదరదన్నారని తెలిపారు.
కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. కానీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం గతేడాది ఫీజు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మా వల్ల కాదు టీసీ ఇవ్వమని అడిగితే.. పాత ఫీజులు కడితేనే టీసీ ఇస్తామని అంటున్నారు. కొవిడ్ కారణంగా ఉపాధి లేక, వ్యాపారాలు సాగక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ వీళ్లు మాత్రం మమ్మల్ని ఆన్లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. ఒక్క స్కూల్ బస్సు ఫీజు మినహా.. మిగిలిన అన్ని రుసుములు వసూలు చేయాలని చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. -విద్యార్థుల తల్లిదండ్రులు