Parakala Amaradhamam : నిజాం నిరంకుశ పాలనకు ఎదురెళ్లి ప్రాణాలను లెక్క చేయకుండా.. నిజాం తూటాలకు బలైన ఎంతోమంది అమరవీరుల త్యాగాలకు గుర్తుగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరదామం(Amaradhamam) కళ్లకు కట్టినట్లుగా నిర్మించారు. ప్రతి ఏటా అమరవీరులను(Martyrs) స్మరిస్తూ సెప్టెంబర్ 2న ఘనంగా నివాళులు అర్పిస్తారు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. నిజాం రాజ్య పరిధిలోని నేటి తెలంగాణ, కొంత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని జిల్లాల్లోని ప్రజలకు నిరంకుశ పాలన కింద కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలపాలని పెద్ద ఎత్తున స్వాతంత్య్ర పోరాటం సాగింది. దీనిలో భాగంగా పరకాల ప్రాంతంలో 1947 సెప్టెంబరు 2న పరకాలలోని విశాల మైదానం(ఇప్పటి అమరవీర స్వాతంత్య్ర సమరవీర మనోహర స్మారక భవనం)లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి వేలాదిగా వివిధ గ్రామాల ప్రజలు చేరుకున్నారు. వీరందరూ ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారని నిజాం సిపాయిలకు స్థానిక తహసీల్దార్ తప్పుడు సమాచారం అందించారు.
వీరప్పన్ను గడగడలాడించిన ధీశాలి.. జనం గుండెల్లో సజీవం..
Parakala Martyrs Memorial Stupa : ఆ సమాచారంతో అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జియా ఉల్లా నేతృత్వంలోని రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, లాఠీఛార్జీ చేయటంతో క్షణాల్లో ఆ ప్రాంతం మరుభూమిగా మారింది. పరకాల మైదానంలో అమరవీరుల రక్తపుటేరులు పారాయి. ఈ ఘటనలో 13 మంది పోరాట యోధులు అక్కడికక్కడే అమరవీరులు అవ్వగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
రేగొండ మండలం దమ్మన్నపేట, కనపర్తి, నాగుర్లపల్లె, రేగొండ, చిట్యాల మండలం చల్లగరిగె, గోవిందాపురం గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య, వర్దెల్లి వీరయ్య, ఎండీ రాజ్‌మహ్మద్‌లను ఒకే చెట్టుకు కట్టేసి రజాకారులు దారుణంగా కాల్చి చంపారు. తర్వాత 1948 సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించింది.