తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వశక్తితో పైకి ఎదిగి.. మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న పద్మజ - latest news in warangal

Padmaja business in sarees at Hanumakonda: చేతిలో డబ్బుల్లేవు.. భర్తకు ఉద్యోగం లేదు.. అయినా ఆత్మ విశ్వాసంతో చీరాల నుంచి నాలుగు చీరలతో హనుమకొండకు వచ్చింది. ఇంట్లోనే చీరల దుకాణాన్ని ప్రారంభించింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా విక్రయిస్తూ.. అందరి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం రూ.50 వేల నుంచి లక్ష రూపాయల విలువైన చీరలు విక్రయిస్తోంది. పద్మజ స్వశక్తితో పైకి ఎదిగి, స్వావలంబన సాధించడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది.

Padmaja
పద్మజ

By

Published : Mar 8, 2023, 9:32 AM IST

Padmaja business in sarees at Hanumakonda: చీరలంటే మగువలకు ఎంతో మక్కువ. ఎన్ని చీరలున్నా ఇంకా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఐతే ఎప్పటికప్పడు మారుతున్న అభిరుచికి అనుగుణంగా మహిళలకు నచ్చే చీరలు అందుబాటులోకి తేవడం వ్యాపారస్తులకు చాలా క్లిష్టమైన పని. కానీ ఆ పనిలో అందెవేసిన చేయి పద్మజది. కలుపుగోలుతనం, మంచి మాటతీరుతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఏదో రెండు చీరలు చూసిపోదామని వచ్చిన వారు .. నాలుగు కొనకుండా ఆ దుకాణం నుంచి కాలు బయటపెట్టరు. చీరాల నుంచి హనుమకొండకు వలసొచ్చిన పద్మజ.. మొదట్లో చిన్నగా చీరల దుకాణం మొదలుపెట్టింది. తర్వాత పట్టుదలతో వృద్దిచేసింది.

అన్ని వయస్సుల వారికి మెచ్చే చీరలు: ప్రస్తుతం ఇంట్లోనే ఓ అంతస్తులో విశాలమైన చీరల షోరూం ఏర్పాటు చేసింది. కంచి, బనారస్, గద్వాల్, పోచంపల్లి వంటి రకరకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు విక్రయిస్తోంది. యువతుల నుంచి మలి వయస్సు వారి వరకు అంతా నచ్చే మెచ్చే చీరలు అమ్ముతోంది. తన చీరల సెంటర్‌లో రూ.200 నుంచి 50 వేలు, లక్ష విలులైన చీరలను విక్రయిస్తున్నట్లు పద్మజ చెబుతోంది.

అనుబంధ షాపులు ఏర్పాటు: స్వయంగా మగ్గం కార్మికుల దగ్గరకు వెళ్లి వైవిధ్యమైన డిజైన్లలో చీరలు ఎంపిక చేసుకొని పద్మజ తీసుకొని వస్తోంది. చీరలకు మ్యాచింగ్ గాజులు, ఆభరణాలు, టైలరింగ్, డ్రై క్లీనింగ్‌ వంటి వాటిని తన దుకాణానికి అనుబంధంగా ఏర్పాటుచేయించారు. స్థానికంగా వరంగల్ హనుమకొండ సహా వివిధ ప్రాంతాల నుంచి మహిళలు చీరలు కొనుగోలు చేస్తున్నారు. చాలామంది మహిళల్లో ప్రతిభ ఉందని గుర్తించి ప్రోత్సహిస్తే మహిళలు సాధికారత దిశగా ముందడుగు వేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నాణ్యత, వైవిధ్యమైన డిజైన్లు, అందరికీ అందుబాటు ధరల్లో చీరలు విక్రయిస్తూ కొనుగోలుదార్ల ప్రేమ, ఆదరాభిమానాలు పద్మజ సంపాదించుకుంటోంది. భవిష్యత్తులో మరింతగా వ్యాపారాన్ని విస్తరిస్తానంటున్న ఆమె.. పలు సేవా కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది.

"అనుకోకుండా ఈ చీరల వ్యాపారం మొదలుపెట్టాను. ప్రతి చిన్న దుస్తులను వినియోగదారులకు నచ్చే విధంగా కొనుగోలు చేస్తాం. వారికి నచ్చినవి వర్కింగ్​తో సహా సలహాలు ఇస్తాను. వినియోగదారుల నమ్మకంతో బాగా నడపగలుగుతున్నాను. దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. మా షాపు నాణ్యత పాటిస్తాం. అందువలనే వచ్చిన వాళ్లు మరోకరని తీసుకు వస్తున్నారు. ఒకసారికి కావల్సిన పనులు అన్ని మా షాపులోనే అయ్యేట్టు సౌకర్యాలు ఏర్పాటు చేశాను."- పద్మజ, స్వశక్తితో ఎదిగిన చీరల వ్యాపారి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details