తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రహదారులపైకి వరద నీరు చేరి.. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో పాటు విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

మళ్లీ దంచికొడుతున్న వానలు.. పొంగుతోన్న వాగులు, వంకలు
మళ్లీ దంచికొడుతున్న వానలు.. పొంగుతోన్న వాగులు, వంకలు

By

Published : Jul 22, 2022, 8:06 PM IST

Updated : Jul 22, 2022, 10:16 PM IST

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్​ జిల్లాను మరోసారి వరద ముంచెత్తింది. హనుమకొండలో ఏకధాటిగా వర్షం పడుతుండటంతో నగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ముసురుతో కూడిన వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. పలు కాలనీల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

మహబూబాబాద్​లో సుమారు రెండు గంటల పాటు వాన పడింది. తొర్రూరు పట్టణంలో కాలనీలు జలమయమయ్యాయి. తొర్రూరు-కంఠాయపాలెం గ్రామానికి మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. కొమ్ములవంచ వద్ద పాఠశాల బస్సు వరదలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు బస్సులోంచి విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

నీట మునిగిన రహదారి..: జగిత్యాల జిల్లా మల్లాపూర్​లోని ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వర్షం కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. కొండ సమీపంలో మోడల్ స్కూల్​ను నిర్మించారు. భారీ వర్షానికి మట్టి కొట్టుకుపోయి రోడ్డు పూర్తిగా నీట మునిగింది. ప్రధాన రహహరి నుంచి పాఠశాలకు వెళ్లేదారి పంట పొలాల మధ్య ఉండగా.. విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

కాలనీల్లోకి వరద నీరు..: సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హుజూర్​నగర్, మేళ్ల చెరువు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకీడు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. జోరు వానకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. యాదాద్రిలో ప్రధాన రహదారి జలమయం అయ్యింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తులు వర్షంలోనూ దర్శనం చేసుకున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా..

  • మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో 20.6 సెం.మీ వర్షపాతం
  • జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో 19 సెం.మీ వర్షపాతం
  • భద్రాద్రి జిల్లా కరకగూడెంలో 16 సెం.మీ వర్షపాతం నమోదు
  • మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో 14.9 సెం.మీ వర్షపాతం
  • మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో 14.8 సెం.మీ వర్షపాతం
  • మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారంలో 14.1 సెం.మీ వర్షపాతం
  • సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 13.7 సెం.మీ వర్షపాతం
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌ మండలంలో 12.7 సెం.మీ వర్షపాతం
  • భద్రాద్రి జిల్లా సత్యనారాయణపురంలో 12.1 సెం.మీ వర్షపాతం
  • యాదాద్రి జిల్లా గుండాలలో 12.1 సెం.మీ వర్షపాతం నమోదు
  • ఖమ్మం జిల్లా పమ్మీలో 11.8 సెం.మీ వర్షపాతం నమోదు
  • ఖమ్మం జిల్లా నాగులవంచలో 11.7 సెం.మీ వర్షపాతం నమోదు
  • సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 11.7 సెం.మీ వర్షపాతం నమోదు
  • జనగామ జిల్లా కోలుకొండలో 11.5 సెం.మీ వర్షపాతం నమోదు
  • సూర్యాపేట జిల్లా ఉర్లుగుండలో 11.5 సెం.మీ వర్షపాతం నమోదు
  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 11.5 సెం.మీ వర్షపాతం నమోదు
  • మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో 11.3 సెం.మీ వర్షపాతం నమోదు
  • సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో 11.2 సెం.మీ వర్షపాతం నమోదు
  • సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదు
  • సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 11 సెం.మీ వర్షపాతం నమోదు

ఇవీ చూడండి..

భాగ్యనగరంపై మళ్లీ వరుణుడి ప్రతాపం.. లోతట్టు ప్రాంతాలు ఆగమాగం..!

'ఇక పొడిగించేది లేదు.. అదే డెడ్​లైన్'.. ఐటీఆర్‌ గడువుపై కేంద్రం క్లారిటీ

Last Updated : Jul 22, 2022, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details