వెం..క..ట..మ్మ.. నా పేరు ఎంత ముద్దుగుందో! - literacy in hanmakonda
08:11 November 20
వెం..క..ట..మ్మ.. నా పేరు ఎంత ముద్దుగుందో
చిన్నతనంలో చదువు విలువ తెలియకనో.. ఆ దిశగా ఎవరూ ప్రోత్సహించకపోవడం వల్లనో.. చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకో చాలా మంది బాల్యంలోనే విద్యకు దూరం అవుతారు. కొంతమంది నాలుగు, ఐదో తరగతుల్లోనే చదువు మానేస్తారు. అలా విద్య లేకున్నా ఎన్నో కష్టనష్టాలకోర్చి జీవితాన్ని అందంగా ఆనందమయం చేసుకుంటారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ వారిని పోషిస్తుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి.. ఏదో ఒక పరిస్థితిలో ఎంత కష్టమైనా తాము చదువు కొనసాగించి ఉంటే బాగుందని బాధపడుతుంటారు. చిన్నతనంలో తాము నేర్చుకున్న ఆ నాలుగు అక్షరాలు రాయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా వచ్చిన ఏ సందర్భాన్ని వదులుకోరు. ఇలాంటి సంఘటనే హనుమకొండ బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్లో ఓ వృద్ధురాలికి ఎదురైంది. తను నేర్చుకున్న నాలుగు అక్షరాలే కాకుండా.. ఎన్నో ఏళ్ల తర్వాత తన పేరు రాసుకుని చూసి ఎంతో మురిసిపోయింది.
బలాన్నంతా కూడదీసుకుని.. ఏకాగ్రతతో కాగితంపై పెన్నుతో రాస్తున్న ఈ వృద్ధురాలి పేరు వెన్నపూస వెంకటమ్మ. వృద్ధాప్యంలోనూ ఎంతో శ్రద్ధగా రాస్తున్న ఆ బామ్మను చూస్తుంటే ముచ్చటేస్తుంది కదూ.. హనుమకొండ బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్లో కనిపించింది ఈ దృశ్యం. జాతీయ పుస్తక పఠన వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌కు చెందిన ప్రేరణ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు శుక్రవారం బాలసముద్రం మార్కెట్‌లో వయోజనులకు అక్షరాస్యత, పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా 72 ఏళ్ల వెంకటమ్మ.. చిన్ననాట దిద్దిన ఓనమాలను గుర్తుకుతెచ్చుకుని తన పేరును ఇలా రాశారు. మలి వయసులోనూ తన పేరును పొల్లుపోకుండా రాసి చూపిన వెంకటమ్మను చూసిన అక్కడి వారంతా ముక్కున వేలేసుకున్నారు! వరంగల్ నగరంలోని ఉర్సు ప్రాంతానికి చెందిన వెంకటమ్మ కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.