ఈ వృద్ధుడి పేరు గుర్రాల మల్లయ్య. 86 ఏళ్లు ఉంటాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. అందరినీ పెంచి వివాహాలు చేశారు. కుమారులు తమకు నిలువ నీడ లేకుండా చేశారని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య తాను సంపాదించిన మూడెకరాల భూమిని ఎకరం చొప్పున కొడుకులకు పంచారు. వారంతా వేర్వేరుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మల్లయ్య చిన్నపాటి గుడిసెలో భార్యతో కలిసి ఉండేవారు. ఆమెకు కళ్లు సరిగా కనిపించవు. అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో నిత్యం మల్లయ్యే సపర్యలు చేస్తుంటారు. వృద్ధాప్య పింఛనుపై ఆధారపడి జీవించేవారు.