తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ మహా నగరమైనా అభివృద్ధిలో ఎందుకు వెనకబడుతోంది!

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) పెద్దది. వరంగల్‌ త్రినగరం మహా నగరమై 2015లో గ్రేటర్‌గా ఏర్పడింది. స్థాయి పెరిగినా అధికారులు, ఉద్యోగులు సరిపడా లేక పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో ఉన్నతస్థాయి అధికారుల్లేక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఐదేళ్లవుతున్నా బల్దియాను అధికారుల కొరత వెంటాడుతోంది.

warangal
warangal

By

Published : Jul 4, 2020, 11:50 AM IST

వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చీఫ్‌ ఇంజినీర్‌(సీఈ), అదనంగా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) పోస్టులు మంజూరు చేయాలని గ్రేటర్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు(సీడీఎంఏ) డాక్టర్‌ సత్యనారాయణకు లేఖ రాశారు. ఉద్యానం, ప్రజారోగ్యం, అర్బన్‌ మలేరియా, సాధారణ పరిపాలన విభాగాల్లో అధికారుల్లేక పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

విభాగాల వారీగా ఇలా..

సాధారణ పరిపాలన విభాగం

కాజీపేట, కాశీబుగ్గ సర్కిల్‌ కార్యాలయాలు ఏర్పడి ఏడేళ్లైంది. సరిపడా అధికారులు, ఉద్యోగుల్లేక పాట్లు తప్పడం లేదు. కాజీపేట సర్కిల్‌ ఆఫీస్‌కు ఉపకమిషనర్‌ ల్లేరు. ఇన్‌ఛార్జి అధికారి బాధ్యతలు చూస్తున్నారు. నాలుగు ఉపకమిషనర్‌ పోస్టులకు ఒక్కరే ఉన్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ ..

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.250-300 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతాయి. నిబంధనల ప్రకారమైతే గ్రేటర్‌కు చీఫ్‌ ఇంజినీర్‌(సీఈ) ఉండాలి. ఇంత వరకు ఎవర్నీ నియమించలేదు. ఒక ఎస్‌ఈ ఉండగా హైదరాబాద్‌లో అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. మరొక ఎస్‌ఈ, రెండు ఈఈ పోస్టులు, 12 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీర్ల కొరత వెంటాడుతోంది. దీంతో అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కరవైంది. సీఈ అధికారి వస్తే అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతులు ఇక్కడే పొందవచ్చు

పట్టణ ప్రణాళిక

పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు కొరత ఉంది. సిటీప్లానర్‌ ఆర్‌ఎన్‌.చారి గతనెల 30 తేదీన పదవీ విరమణ పొందారు. దీంతో సిటీప్లానర్‌ పోస్టు ఖాళీ అయింది. డిప్యూటీ సిటీప్లానర్‌ (డీసీపీ)ను ఇన్‌ఛార్జిగా నియమించారు. రెండు డీసీపీలు, రెండు ఏసీపీలు, టీపీబీవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్‌ స్థాయికి చీఫ్‌ సిటీప్లానర్‌(సీసీపీ) అదనపు డైరెక్టర్‌ క్యాడర్‌ అధికారి ఉండాల్సి ఉన్నా ఇంత వరకు మంజూరు కాలేదు.

ప్రజారోగ్య విభాగం

వరంగల్‌ మహా నగరంలో పారిశుద్ధ్యం పనులపై పర్యవేక్షణ కొరవడింది. నిబంధనల ప్రకారమైతే చీఫ్‌ ఆరోగ్యాధికారి, ఇద్దరు ఆరోగ్యాధికారులు ఉండాలి. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. చీఫ్‌ ఆరోగ్యాధికారి పోస్టు ఇంత వరకు భర్తీ కాలేదు.

అర్బన్‌ మలేరియా విభాగం

నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఏటా రూ.1.50 కోట్లు ఖర్చవుతున్నా ప్రజలకు ఉపశమనం లేదు. అర్బన్‌ మలేరియా విభాగం బయాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది.

ఉద్యాన విభాగం

నూతన పురపాలక చట్టం ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్‌ బడ్జెట్‌ మొదలైంది. గ్రేటర్‌లో రూ.20.50 కోట్లు కేటాయించారు. ఉద్యాన విభాగంలో ఒక సీహెచ్‌వో ఉన్నారు. ఆర్నెల్ల క్రితం హెచ్‌వోను సరెండర్‌ చేశారు. ఇంత వరకు కొత్త వారు రాలేదు. ప్రస్తుతం నగరంలో ముగ్గురు అధికారుల అవసరం ఉంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details