New elegance to Armoor Silk Sarees : చీరలెన్ని ఉన్నా... పట్టుచీర ప్రత్యేకతే వేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాలు. యాభై ఏళ్ల కింద వివాహ వేడుకల్లో తళుకులీనిన ఆర్మూరు పట్టుచీరలకు... వరంగల్ మహిళా నేత కార్మికులు కొత్త సొబగులు అద్దుతున్నారు. చక్కటి జరీ పనితనంతో....చూడగానే మనసు దోచే ఆర్మూరు పట్టు చీరలను తయారుచేస్తూ.... తమకు సాటి పోటీ మరొకరు లేరని చాటుతున్నారు. స్వయం ఉపాధి పొందుతూ... యువతులు... తమ కాళ్లపైన తాము నిలబడి.. మిగతావారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేతన్నకు అండగా...
రాష్ట్ర చేనేత జౌళి శాఖ...వరంగల్ హనుమకొండ చేనేత సంఘాలకు మగ్గాలను అందించి...ఆర్మూర్ పట్టుచీరలు, హిమ్రూ దస్తుల తయారీలో శిక్షణ ఇప్పిస్తోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం..చేనేత సొసైటీలో మహిళలకు ఆర్మూరు పట్టు చీరలను నేసేందుకు....తర్ఫీదునిచ్చారు. ధర్మవరం నుంచి పట్టు దారాన్ని తీసుకొచ్చి జకార్ట్ విధానంలో...అధునాతన డిజైన్లతో చీరలను అందంగా నేస్తున్నారు. నేతన్నల పిల్లలు అద్భుతంగా చీరలు నేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. .
మహిళల స్పెషల్ ఫోకస్
హనుమకొండ జిల్లా కమలాపూర్ సొసైటీలో గతేడాది నిజాం కాలంలో రాజకుటుంబీకులు ధరించే హిమ్రూ దుస్తులు నేశారు. ఇపుడు ఆర్మూరు చీరలు నేయడంపై మహిళలు దృష్టిసారించారు. అదరహో అనిపించే పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఓరగల్లు వనితల పనితనానికి గర్వపడుతున్నామని సొసైటీ సంఘాల బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మేము పొద్దున లేస్తే కూలికి పోయేవాళ్లం. ఆర్మూర్లో ట్రైనింగ్ పెట్టారు. మాకు వృత్తి మీద ఉన్న గౌరవంతో ఈ పనిని నేర్చుకుంటున్నాం. మాకు ట్రైనింగ్ ఇవ్వడంపై సంతోషంగా ఉంది. ట్రైనింగ్లో చీరల గురించి బాగా తెలిసింది. ఏదో షాపుకు పోయి చీరలు కొనేవాళ్లం. కానీ ఏ చీర ఎలాంటిది అనేది ఇప్పుడు బాగా తెలిసింది.