గత ఐదేళ్లలో ఈఅండ్‌ఐసీటీ అకాడమీ, టీచింగ్ లెర్నింగ్ సెంటర్(టీఎల్‌సీ), పీఎంఎంఎంఎన్‌ఎంటీటీ వంటి అధ్యయన కేంద్రాలు ప్రారంభించి దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వేల మంది అధ్యాపకులకు వర్క్‌షాపులు, సదస్సులు, సింపోజియం నిర్వహించి అకడమిక్ ఎక్సెలెన్సీ సాధించేందుకు వరంగల్ ఎన్‌ఐటీ కృషి చేసింది. ఈ నేపథ్యంలో పలు విభాగాలలో ఎంటెక్‌లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి పలు కొత్త కోర్సులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సర్టిఫికెట్ కోర్సులు
అటల్ అకాడమీ కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు చెందిన విషయనిపుణులతో మారుతున్న సాంకేతిక ట్రెండ్‌కు అనుగుణంగా ఈ కోర్సులు ప్రారంభించనున్నారు.
ఎంటెక్ బయోటెక్నాలజీ..
నిట్‌లోని యూజీ విభాగంలో చివరగా ప్రారంభమైన కోర్సు బీటెక్ బయోటెక్నాలజీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవసాంకేతిక శాస్త్రానికి విస్తృత ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో నిట్‌లో ఈ ఏడాది నుంచి ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టడానికి నిట్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
వ్యర్థాల నిర్వహణ..
వ్యర్థాల నిర్వహణపై కొత్తగా ఎంటెక్ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభించేందుకు నిట్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కోర్సులో 20 సీట్లు ఉంటాయి. రెండేళ్లపాటు కోర్సు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నగరాలలో, మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ అనేది అతిపెద్ద సవాలుగా మారింది. ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టడంతో కొన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మాన్యుఫ్యాక్చరింగ్..
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో త్రీడీ ప్రింటింగ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఎంటెక్‌లో ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభమైంది. దీనిలో ఇప్పటికే పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఈ విభాగంలో మెటీరియల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ వంటి ఎంటెక్ కోర్సు విజయవంతంగా నడుస్తుంది.
స్మార్ట్ గ్రిడ్..
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్తగా ఈ ఏడాది స్మార్ట్‌గ్రిడ్ ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దైనందిన జీవితంలో విద్యుత్ నిత్యావసరంగా మారింది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగిన విధంగా శక్తి ఉత్పాదన అనేది అతిపెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో ఈ కోర్సుకు ప్రాధాన్యం ఏర్పడింది.