మినీ పురపోరులో తిరుగులేని విజయం సాధించిన గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా ఆయా నగరపాలికలు, పురపాలికలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక క్రతువు నిర్వహించారు. తెరాస అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా నియమించిన పరిశీలకుల ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ఛైర్మన్ల అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్లలో పంపించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఎన్నిక సజావుగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు కలిసి సమన్వయంతో పనిచేశారు. ఉదయమే ఆయా కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సమావేశమైన మంత్రులు, సీనియర్ నేతలు ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా మొత్తం ఎన్నిక ప్రక్రియను పూర్తిచేశారు.
గ్రేటర్ వరంగల్ మేయర్‌గా..
గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వాన షమీమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి సంధ్యా రాణి సమక్షంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. ముందుగా కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ఓరుగల్లు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. మేయర్‌గా ఎన్నికైన గుండు సుధారాణి.. వరంగల్ 29వ డివిజన్ నుంచి గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన రిజ్వానా షమీమ్ వరంగల్ 36వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓరుగల్లు కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ వ్యవహరించారు. సుధారాణి, షమీమ్ పేర్లను ప్రకటించిన మంత్రులు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ఆద్యంతం పర్యవేక్షించి సజావుగా జరిగేలా చూశారు. అసంతృప్తులకు తావులేకుండా అధిష్ఠానం ఆదేశాలు అమలయ్యేలా వ్యవహరించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, తెరాస 48, భాజపా 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదంటూ భాజపా సభ్యులు మేయర్ ఎన్నికను బహిష్కరించారు.