Katakshapur Bridge Rains issues :హనుమకొండ నుంచి మేడారం వెళ్లే మార్గంలో జాతీయ రహదారి 163పైన ఉన్న.. కటాక్షాపూర్ పాత వంతెనకు మోక్షం కలగకపోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పడంలేదు. హనుమకొండ నుంచి నిత్యం వేలాదిగా వాహనాలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి. పక్కనే ఉన్న కటాక్షాపూర్ చెరువు.. కాస్త వర్షం వస్తే చాలు మత్తడి పోస్తుంది. లోలెవల్ వంతెన కావడంతో మత్తడి నీళ్లన్నీ వంతెనపైకి వచ్చేస్తాయి. ఇక అంతే వంతెనపై రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోవాల్సిందే.
Hanamkonda Rains:ముప్పై ఏళ్లుగా ఇదే సమస్య ఉన్నా.. ఇప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి ముహుర్తం కుదరట్లేదు. ఇటీవల వర్షాలు ఎక్కువకావడంతో సమస్య మరీ ఎక్కువైంది. రూ.317 కోట్లతో వంతెన సహా 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నిధులూ మంజూరయ్యాయి. కానీ గుత్తేదారు నిర్లక్ష్యం అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణా లోపంతో వంతెన నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
"గత సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి ఇలానే ఉంది. దీనిని పట్టించుకునేవారు ఎవరూలేరు. అంతకముందు ఇక్కడికి సీఎం కేసీఆర్ వచ్చారు.. కానీ ఇక్కడ ఎటువంటి మార్పు రాలేదు. వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.. కానీ అధికారులు మాత్రం కాస్త కూడా పట్టించుకోవడం లేదు. ఈ బ్రిడ్జి నిర్మిస్తేనే మాకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే వర్షాకాలంలో మాకు ఇబ్బందులు తప్పవు. చాలా మంది బ్రిడ్జిని దాటేతప్పుడు ప్రమాదాల బారినపడుతున్నారు. బ్రిడ్జి నిర్మిస్తే మాకు చాలా బాగుంటుంది." - స్థానికుడు