Mother Complaint Against Sons to District Collector: కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడాన్ని నేటితరం పిల్లలు భారంగా ఫీలవుతున్నారు. వారికి బుక్కెడు అన్నం పెట్టడానికి కూడా మనసు రావడం లేదు. ప్రేమానురాగాలను పంచిన ఆ తల్లిదండ్రులనే వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని చూడకుండా ఆస్తి, పాస్తులని లెక్కలేసుకుని గిరిగీసుకుని బతుకుతున్నవారు ఎందరో.. కన్నవారికి కొంచె అన్నం పెట్టలేక వంతులేసుకొని వారిని భారంగా అనుకుంటున్నారు.
కనీ.. పెంచి.. పెద్దచేసినందుకు వృద్ధాప్యంలో ఇలా: వాస్తవం చెప్పాలంటే.. తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులున్నంత వరకే వారికి విలువ ఇస్తున్నారు నేటి తరం పిల్లలు. కన్నవాళ్లు కాటికి కాలు చాపే వయసు రాగానే.. ఏదో ఒక మాయ మాటలు, కాకమ్మ కథలు చెప్పి వారి నుంచి ఆస్తి తీసేసుకుని చివరకు మాకు అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కనీ.. పెంచి.. పెద్దచేసినందుకు వృద్ధాప్యంలో ఒక్క పూట అన్నం కోసం చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. వారి గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. అలాంటి ఘటనే హనుమకొండ జిల్లాలో జరిగింది.
Mother Complaint on Sons: ఆ తల్లి నవమాసాలు మోసి కుమారులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటికి ఎదురు నిలబడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసింది. పెళ్లిళ్లు కూడా జరిపించి ఓ ఇంటి వారిని చేసింది. అనుకోకుండా కట్టుకున్న భర్త మరణించారు. తండ్రి దూరమైన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. ఆ కుమారులు ఆమెకు తిండిపెట్టకుండా రోడ్డున పడేశారు. ఆమె కష్టపడి దాచిపెట్టిన సొమ్మంతా లాక్కున్నారు. చివరికి ఆమె దగ్గర ఏం లేకపోవడంతో.. అభాగ్యురాలిగా కుమార్తెలు, బంధువుల ఇంట్లో ఉంటూ జీవిస్తోంది.