Mirchi Farmers Protest: సరైన దిగుబడి లేక చేతికందివచ్చిన పంటకూ ధర లేక వరంగల్ మిరప రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంట వేసిన రోజు నుంచి విక్రయం వరకూ అన్ని కష్టాలే. గతఏడాది నవంబర్ నుంచి తామర పురుగు... మిరప రైతుల పాలిట శాపంగా మారింది. కళ్ల ముందే పంటను తామర పురుగులు తినేస్తుంటే వేలకు వేలు పురుగు మందుల కోసం వెచ్చించారు. అయినా ఫలితం లేకపోగా.. పెట్టుబడి ఖర్చు రెట్టింపైంది. ఎకరానికి 20 క్వింటాళ్ల మేరకు దిగుబడి చూసిన రైతుకు ఈసారి నాలుగైదు క్వింటాళ్లు కూడా రావడం గగనమైంది. కొద్దోగొప్పో మిగిలిన పంటను చూసి సంతృప్తి పడుతుంటే సంక్రాంతి పండగ రోజుల్లో వచ్చిన అకాల వర్షాలు మిరప రైతును కోలుకోలేని దెబ్బ తీశాయి.
ధర రూపంలో నిరాశే..
నష్టపోగా మిగిలిన పంటను మార్కెట్ తీసుకొచ్చిన రైతుకు మళ్లీ ధర రూపంలో నిరాశే ఎదురవుతోంది. జెండా పాట పేరుతో మిరప రైతు దోపిడీకి గురవుతున్నాడు. ధర చూస్తే క్వింటాలుకు 17 వేలకు పైగా ఉంటున్నా.... ఆ ధర ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే వస్తోంది. మిగిలిన రైతులందరికీ మళ్లీ పది వేలు.. ఎనిమిది వేలే. ఇదేమని ప్రశ్నిస్తే నాణ్యత బాగోలేదన్న సమాధానమే వ్యాపారస్తుల నుంచి ఎదురవుతోంది. సోమవారం ఎనుమాముల మార్కెట్ మొత్తం మిరప బస్తాలతో కళకళలాడింది. 20 వేలకు పైగా బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయి. తీరా ధర చూసేసరికి రైతుకు కన్నీరే మిగిలింది.
అన్నదాతల ఆగ్రహం