వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. హన్మకొండలో ఓ బాలికపై శనివారం సాయంత్రం ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అవమానం భరించలేక ఆదివారం తెల్లవారుజామున బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలిక నానమ్మ వద్ద ఉంటూ ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్ లకు ఆ బాలికతో పాత పరిచయం ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆ బాలిక ఇంటికి వచ్చిన ఆ యువకులు.. మాయమాటలు చెప్పి ఆమెను ద్విచక్ర వాహనంపై పెంబర్తి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వీరితో పాటు ఓ మైనర్ బాలుడు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ముగ్గురూ పారిపోయారు.
స్టేషన్ ముందు బంధువుల ఆందోళన
ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తన నానమ్మకు తెలిపింది. ఆ తరువాత ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన నానమ్మ ఈ విషయాన్ని గుర్తించి ఇరుగు పొరుగు సాయంతో కేయూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి... వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన తిరుపతి, మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ప్రసన్నకుమార్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కేయూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.