రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేసి... పురాతనవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలోని మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దాతల సహకారంతో నిర్మించిన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
'మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం' - మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలోని మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సందర్శించారు. దేవాలయంలో దాతల సహకారంతో నిర్మించిన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఆలయాన్ని ఆధ్యాత్మికంగానూ, పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తామన్నారు.
శివాలయం, రామాలయం ఒకే క్షేత్రంపై కొలువుండడం ఇక్కడి పత్యేకత అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగానూ, పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తామన్నారు. క్షేత్రంపై సరస్వతి దేవాలయం, అన్నదాన సత్రంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వస్తున్న దాతలను మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి స్వయంగా దైవభక్తి కలవారని... యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు రాతి కట్టడాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.