దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. 60 టీఎంసీల నీటిని... ఆరు లక్షల 20 వేల ఎకరాలకు అందేలా సమగ్ర నివేదికను తయారు చేయాలని సూచించారు. మంత్రి సత్యవతి రాఠోడ్తో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధరరావు, ఎంపీలు బండా ప్రకాశ్, కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు వివిధ ప్యాకేజీల్లో జరిగిన పనులు, జరగాల్సిన పనులపై దాదాపు 5 గంటలకుపైగా సమీక్ష చేశారు. దేవాదులను పూర్తి స్థాయిలో వాడుకుని... జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రులు తెలిపారు. ఇందుకు ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారన్నారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరందాలని... ప్రతి చెరువు నిండాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అందుకనుగణంగా నిర్ధుష్ట ప్రణాళికలు రూపొందించుకుని పని చేయాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యంతో ప్రాజెక్టు ద్వారా నీళ్లందలేదన్నారు. దేవాదులను పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 1, 2లో చిన్న చిన్న పనులు మినహా దాదాపుగా పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రతీ చెరువు కళకళలాడాలి..
"నర్సంపేట, పరకాల, పాలకుర్తి, జనగామ, నియోజకవర్గాల్లో దేవాదుల కాలువల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించాలి. జిల్లాలోని 10 టీఎంసీల సామర్థ్యం ఉండే లింగంపల్లి రిజర్వాయర్ను కూడా త్వరగా పూర్తి చేసి దేవాదుల నీళ్లని పారించాలి. పాలకుర్తి, ఘన్పూర్ నియోజకర్గాల్లో అసంపూర్తిగా ఉన్న ప్యాకేజీ 6 పనులకు సత్వరమే టెండర్లు పిలవాలి. ములుగు, వరంగల్ జిల్లాల్లో పనులను వేగవంతం చేయాలి. ప్రజాప్రతినిధుల, అధికారులు సమన్వయంతో పనిచేసి... దేవాదుల ద్వారా జిల్లాలో చివరి ఆఖరి ఆయకట్టు వరకూ నీరందించాలి. ఎండకాలంలో కూడా ప్రతీ చెరువు నిండి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసి... అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి."- ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి