వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పర్యటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నయీంనగర్, సమ్మయ్య నగర్, సంతోషిమాత నగర్, బొంది వాగు, కరీమాబాద్ బ్రిడ్జి దిగువ ప్రాంతం, ఇదులవాగు పెద్దమ్మగడ్డ నాలా, ఎంజీఎం ఆస్పత్రి, శివనగర్ నాలా పరిసరాలను మంత్రులు సందర్శించారు.
అధైర్య పడకండి.. ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్ - వరంగల్‌లో పర్యటించిన మంత్రులు కేటీఆర్, ఈటల
09:40 August 18
వరంగల్: వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల
హంటర్ రోడ్డులో వరద నీటిలోనే కిలోమీటర్ మేర నడిచిన మంత్రులు.. భద్రకాళి చెరువు సామర్థ్యంపై కలెక్టర్, కమిషనర్‌తో చర్చించారు. ఇంత వరద ఎక్కడి నుంచి వస్తుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు
వరదలతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు మంత్రులకు విన్నవించారు. బట్టలు, బియ్యం సైతం తడిసిపోయినట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వరద ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న కేటీఆర్.. డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశారు.
ఇళ్లలో నీరు నిలిచిన కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్‌లో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తామని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీచూడండి: శాంతించిన గోదారి... 55.3 అడుగులకు చేరిన నీటిమట్టం