గుత్తికోయలు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావుపై దాడి చేసి చంపడాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాఠోడ్ ఖండించారు. అధికారుల విధి నిర్వహణకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. శ్రీనివాసరావుపై దాడి చేసి, దారుణంగా హత్య చేసిన నిందితులను వదిలిపెట్టబోమని అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుందని చెప్పారు.
ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకి అక్రమంగా వలస వచ్చిన గుత్తి కోయలతోనేనని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా అధికారులపై దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. పోడు భూముల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. 68 శాతం గిరిజనులు, 32 శాతం గిరిజనేతరులు ఉన్నారని తెలిపారు. పోడు సర్వే పూర్తయిందని వాటిని నిర్ధారించి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాలు ఇస్తారని వెల్లడించారు.
"ఇలాంటి సంఘటనల ద్వారా సిబ్బంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించడంతో పాటు అడవులను పరిరక్షించే చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా గుత్తికోయలు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడాలని చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’' - పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి