కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా... దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువు నీళ్లతో కళకళలాడే విధంగా పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేవాదుల ప్రాజెక్టుతో ప్రతి చెరువు నీళ్లతో కళకళలాడాలి: మంత్రులు
హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువు నీళ్లతో కళకళలాడే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మీత సభర్వాల్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు దయాకర్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నీటిపారుదలశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. సుమారు ఐదు గంటల పాటు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రాజెక్టుల కోసం నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని మంత్రులు అన్నారు. దేవాదుల ప్రాజెక్టు నీళ్లను ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ ఉపయోగం ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ములుగులో 6000 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగు అవుతుందని మంత్రులు తెలిపారు. గోదావరి పక్కనే ఉన్న ఎక్కువ ఆయకట్టు సాగు అవ్వడం లేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని వెల్లడించారు. లక్నవరం నుంచి నీరు పంపించే క్రమంలో అనేక చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చివరి ఎకరం వరకు నీరు అందే విధంగా ప్రణాళికలు రూపొందించి వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని మంత్రులు పేర్కొన్నారు.