ముంపు ప్రాంతాల్లో మంత్రులు
భారీ వర్షాలు ఓరుగల్లులో విలయం సృష్టించాయి. నగరంలోని లక్ష్మీగణపతికాలనీ, మధురా నగర్, ఎస్.ఆర్ నగర్, సమ్మయ్య నగర్, ఎన్టీఆర్ నగర్‌లు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వడ్డెపల్లి చెరువు నిండి... ఎ.ఎమ్.ఎస్ నగర్‌లోకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన నగర పాలక సంస్థ అధికారులు... బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చింతల్‌లోని కట్టమల్లన్న చెరువు నిండుకుండలా మారడంతో వారిని ఓ ప్రైవేట్ బడిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
వరద ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి... సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు..
మంత్రి సత్యవతి రాఠోడ్ సూచనలు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నెల్లికుదురు మండలం మునిగలవీడు శివారులో చౌట కుంట కట్టకు గండి పడింది. మండలంలో పలు ఇళ్లు కూలిపోయాయి. మొట్లతిమ్మాపురం శివారులో ఉడుముల వాగు దాటుతూ... ఓ యువకుడు గల్లంతయ్యాడు. బాధిత కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.
అనంతరం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్షాలు - ప్రమాదాల నివారణ, హరిత హారంపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన... అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు. జిల్లాలోని 734 చెరువులను కొంత ఎస్సారెస్పీ నీటితో నింపామని... ఈ వర్షపు నీటితో 450 చెరువులు అలుగులు పోస్తున్నాయని మంత్రి వెల్లడించారు. కట్టలు తెగిపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లో లెవల్ బ్రిడ్జిల వద్ద తీసుకోవాల్సిన శాశ్వత చర్యలపై నివేదిక తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు.
మంత్రి వేముల సమీక్ష
ముంపు బాధితులకు వెంటనే పునరావాసం కల్పించాలని రహదారులు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. క్షేత్ర స్థాయిలో నష్టంపై ప్రశాంత్‌రెడ్డి ఆరా తీశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముంపు పొంచి ఉన్నందున... ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆహారం, ఇతర అవసరాల విషయంలో ముంపు బాధితులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని తెలిపారు.
వరద ఉద్ధృతి పరిశీలించిన పువ్వాడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ముందుగా గోదావరి బ్రిడ్జి వద్ద వరదను పరిశీలించిన మంత్రి... అనంతరం లోతట్టు ప్రాంతమైన కొత్త కాలనీ ప్రదేశాన్ని పరిశీలించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికార యంత్రాంగంతో వరద ఉద్ధృతిపై సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల్లోని అధికారులంతా ఎప్పటికప్పుడు వరద తీవ్రతను పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గోదావరి ఉద్ధృతి ఆధారంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున... భద్రాచలంలో గోదావరి నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉందని... దీనిపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి:Fish Hunting: చెరువులైన పొలాలు... చేపల కోసం ఎగబడ్డ స్థానికులు..