Minister Mallareddy Challenge to BJP: కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి కార్మికులను రోడ్డున పడేస్తోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మోదీ నేతృత్వంలో భాజపా పూర్తిగా అబద్ధాల పార్టీగా తయారైందని అన్నారు. రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని మోదీ.. కేసీఆర్‌పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని భద్రకాళీ అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని.. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని విజయదశమి నాడు చక్రం తిప్పేందుకు కేసీఆర్ బయలుదేరతారని ఆయన చెప్పారు. దళితబంధు ఇతర సంక్షేమ కార్యక్రమాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని.. సన్యాసం పుచ్చుకుంటానని మల్లారెడ్డి సవాల్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడి తరహాలో వ్యవహరిస్తున్నారని.. గతంలో ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తుందనుకుంటే.. ప్రజలు నమ్మరని అన్నారు. కాజీపేటలో ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక సదస్సులో మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని.. గతంలో ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతే ఇప్పుడు ఇతర రాష్ట్రాలనుంచే ఇక్కడకు వలస వస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. కార్మికులు లేనిదే ప్రపంచమే లేదని.. వారి సంక్షేమ కోసం ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.