గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముంగిట ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... వరంగల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు వేల కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా... కాజీపేట రాంపూర్‌కి చేరుకుని.... వరంగల్ నగర వాసులకు ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం మిషన్ భగీరథ కింద 939 కోట్ల రూపాయల వ్యయం కాగా... అమృత్ పథకం కింద 413 కోట్లు ఖర్చు చేశారు.
సమీకృత మార్కెట్లు
అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయ్‌పేటలో 10 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించే జర్నలిస్ట్ కాలనీకి.. భూమిపూజ చేస్తారు. దూపకుంట వద్ద 600 మంది లబ్ధిదారుల కోసం.. 31 కోట్ల 80 లక్షల వ్యయంతో, ఎస్‌ఆర్ నగర్‌లో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ చేస్తారు. లక్ష్మీపురంలో 6 కోట్ల 24 లక్షల వ్యయంతో నిర్మించిన పండ్ల మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇక్కడే 24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్లకు శంకుస్థాపన చేస్తారు. బట్టల బజార్‌లో 66 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన... పై వంతెనను మంత్రి ప్రారంభిస్తారు. శివనగర్ వద్ద 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించిన.. రైల్వే అండర్ బ్రిడ్జినీ ప్రారంభిస్తారు.