KTR Warangal Tour Latest Updates :రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓరుగల్లు పర్యటనకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల్లో నిర్మించిన కాకతీయ మెగా జౌళి పార్క్‌కు విచ్చేయనున్న కేటీఆర్.. దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా ఖ్యాతి గాంచిన ఈ పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్‌లో 1203 ఎకరాల్లో ప్రారంభించారు. రూ.567 కోట్లకు పైగా వెచ్చించి టీఎస్‌ఐఐసీ.. పార్కులో అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చింది.
KTR Warangal Tour Today : కరోనా మహమ్మారి కారణంగా తొలుత పనులు మందగించినా.. ఆ తర్వాత వేగం పుంజుకున్నాయి. గణేషా ఎకోపెట్, ఎకోటెక్ కంపెనీలు రూ.588 కోట్లు వెచ్చించి యాభై ఎకరాల్లో రెండు యూనిట్లను ఇప్పటికే ప్రారంభించాయి. వాడిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి.. వాటి నుంచి దారాన్ని తయారు చేస్తున్నాయి. కేరళకు చెందిన కైటెక్స్ రూ.1200 కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో చిన్న పిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతుండగా.. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ పరిశ్రమ 8 ఫ్యాక్టరీలను నిర్మించడానికి సన్నద్ధమైంది.
KTR Tweet on Kakatiya Mega Textile Park: మొత్తం రూ.900 కోట్ల వ్యయంతో 261 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ పూర్తైతే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యంగ్ వన్‌కు శంకుస్థాపన నేపథ్యంలో మంత్రి ట్వీట్ చేశారు. వరంగల్‌లో దేశంలోనే పెద్దదైన టెక్స్‌టైల్ పార్కు.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుబాగా రూపు దిద్దుకుంటోందని మంత్రి అన్నారు. రూ.900 కోట్ల పెట్టుబడితో కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
సుడిగాలి పర్యటన..: మధ్యాహ్నం తరువాత వరంగల్‌లో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేసి.. రూ.618 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని.. నగర పరిసరాలన్నీ ఇప్పటికే గులాబీ మయంగా మారాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు దారిపొడుగునా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో రూ.80 కోట్లతో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి కేటీఆర్ భూమి పూజచేయనున్నారు. ఇంకా రూ.130 కోట్లతో స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ పనులు, రూ.75 కోట్ల వ్యయంతో మోడల్ బస్టాండ్, 2 కోట్లతో కుడా ఆధ్వర్యంలో నిర్మించనున్న సాంస్కృతిక మందిరం పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.