వరంగల్ నగరాన్ని ఫ్యూచర్ సిటీగా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మెట్రో రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఖిల్లా వరంగల్ కోటలో బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
పేద ప్రజలకు అండగా..
'నగరంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న విద్యుత్ కష్టాలకు తెరాస ప్రభుత్వం స్వస్తి చెప్పింది. గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటితో పాటు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ అమృత్ జల్ అందిస్తున్నాం. పేద విద్యార్థుల విదేశీ చదువులకు రూ. 20 లక్షలు ఇస్తున్నాం. కరోనా సంక్షోభంలోనూ పేద ప్రజల ఇంటి నిర్మాణానికి, పేదింటి ఆడపిల్లల పెళ్లికి సీఎం కేసీఆర్ ఆసరాగా నిలబడ్డారు.'