KTR on Rahul Gandhi: వరంగల్‌లోని టెక్స్‌టైల్ పార్క్‌లో రెండేళ్లల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని... దీంతో 20 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికే తలమానికంగా నిలిచేలా కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటు జరుగుతోందని.. కార్యాలయాల ఏర్పాటుకు మరికొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాల్లోనే 50 వేల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పల్లెలకు, పట్టణాలకు సమప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
పొత్తు కావాలని ఎవరైనా అడిగారా?: దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు ఎవరైనా ఉన్నారా.. పొత్తు కావాలని కాంగ్రెస్‌ను ఎవరైనా అడిగారా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఒక ఎంపీగా గెలవని రాహుల్‌గాంధీ ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్.. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారంటూ విమర్శల వర్షం గుప్పించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్‌గాంధీ చదివారన్నారు. వ్యవసాయాన్ని జాతర చేసింది తెరాస సర్కారేనని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందని మంత్రి వెల్లడించారు.