ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు... వరంగల్ వాసుల ఇక్కట్లు ఇంకా తీరడం లేదు. వాగులు వంకల ఉద్ధృతి తగ్గలేదు. వానలు తగ్గుముఖం పట్టినా... పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మురికివాడలు, శివారు ప్రాంత కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. వరదలు, పంట నష్టం తదితర అంశాలపై మంత్రులు ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాఠోడ్, సమీక్షించారు. గోదావరి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం వల్ల ములుగు, భూపాలపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముంపు గ్రామాలను గుర్తించి.... 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే...
మహబూబాబాద్ జిల్లాలో వాగులు...వంకల ఉద్ధృతి తగ్గలేదు. చెరువులు అలుగులు దాటి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి వేమునూరులో రెండు ఇళ్లు....బయ్యారంలో ఓ ఇళ్లు కూలీ పోయాయి. కొత్తపల్లి, బర్కపల్లె వాగులను కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. జనగామ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. తరిగొప్పుల మండలంలోని పోతారం నుంచి సూల్‌పురం వెళ్లే రహదారి దెబ్బతింది. జిల్లాలో ఏడు రహదారులు నీటి ప్రవాహానికి మునిగిపోగా.... ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో వర్షాల ధాటికి 36వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరంగల్‌లో వరదల దుస్థితి వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హన్మకొండలోని పలు ముంపు ప్రాంతాలను, జలమాయమైన కాలనీలను ఆయన పరిశీలించారు.
వేల ఎకరాల్లో నీట మునిగిన పంట