Harishrao On MGM Incident: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాయంత్రంలోగా నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆస్పత్రిని పరీశీలించిన జిల్లా అదనపు కలెక్టర్... ఘటనకు గల కారణాలను ఆరా తీశారు.
Harishrao On MGM Incident: ఎంజీఎం ఘటనపై మంత్రి హరీశ్‌రావు సీరియస్
15:30 March 31
విచారణకు ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు
అసలేం జరిగిందంటే:అసలే ప్రాణాపాయస్థితి. జిల్లాలో పేరెన్నికగన్న ప్రభుత్వ పెద్దాసుపత్రికి వెళ్తే ప్రాణాలు నిలుపుకోవచ్చనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రాణాలు నిలుపుకుందామనే వస్తే ఎలుకలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల... భూమ్మీద నూకలు చెల్లిపోయే పరిస్థితి దాపురించింది. ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి... మరికొందరు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో ఎలుకల కారణంగా కొందరు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలే కిడ్నీ, లివర్ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్ మీద ఎలుకలు రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేసి కాళ్లు, చేతుల వేళ్లు కొరికాయి. దీంతో ప్రాణాలు నిలుపుకుందామని ఇక్కడికొస్తే ఇదేం పరిస్థితి అంటూ శ్రీనివాస్ బంధువులు వాపోతున్నారు.
చర్యలు తీసుకుంటాం:ఘటనపై స్పందించిన ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్... బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి పడేయడం వల్లే ఎలుకల బెడద ఎక్కువైందని పేర్కొన్నారు. ఎలుకల దాడికి గురైన శ్రీనినాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు.