తెలంగాణ

telangana

'ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది ఉండొద్దు'

By

Published : Apr 5, 2021, 4:22 PM IST

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. గతేడాది కన్నా ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హన్మకొండలో ధాన్యం కొనుగోళ్లు, కరోనా వ్యాప్తి, సమీకృత మార్కెట్లపై అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సహా పలువురు నేతలతో ఆయన సమీక్ష జరిపారు.

Review on grain purchases
Errabelli Dayakar Rao

సవాల్​గా తీసుకుని... ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయకర్​ రావు అధికారులను ఆదేశించారు. రైతు నష్టపోకుండా బాగుండాలన్నదే కేసీఆర్​ ఉద్దేశ్యమన్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు కొనుగోళ్లు చేయకున్నా తెలంగాణలో చేస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం కన్నా... ఈసారి మరిన్ని ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

తాలు, తడిసిన ధాన్యం తీసుకురావొద్దని రైతులకు ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. కొనుగోళ్ల కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. పత్తి, కందులు, ఆయిల్ పామ్​ తదితర డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఎర్రబెల్లి రైతులకు సూచించారు.

హన్మకొండలో వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు... కొవిడ్ వైరస్ వ్యాప్తి, సమీకృత మార్కెట్లు మొదలైన అంశాలపై మంత్రి సత్యవతి రాఠోడ్, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి ఆయన సమీక్షించారు. సమావేశం ప్రారంభంలో బాబు జగజ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గత ఏడాది కొనుగోళ్ల సందర్భంగా ఎదురైన సమస్యలు... ఈసారి ఎదురు కాకుండా... అధికారులు పక్కా ప్రణాళికతో సిద్ధమవ్వాలని మంత్రి సత్యవతి కోరారు. కరోనా కష్టకాలంలోనూ... ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరపడం... రైతుల పట్ల ముఖ్యమంత్రికి గల ప్రేమ తెలియజేస్తోందని కొనియాడారు.

ఇదీ చూడండి:రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details