minister errabelli on agnipath: సికింద్రాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దామెర రాకేష్ అంతిమయాత్ర వరంగల్ ఎంజీఎం నుంచి కొనసాగుతోంది. అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాఠోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెరాస నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం వద్ద రాకేష్ మృతదేహానికి మంత్రులు, నేతలు నివాళులర్పించారు.
రాకేష్ మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెరాస నేతలు ఆరోపించారు. కేంద్రం అనాలోచిత విధానాలతో యువకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలన్న మంత్రి ఎర్రబెల్లి.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేంతవరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎర్రబెల్లి.. రాకేష్ స్వగ్రామం డబీర్‌పేట వరకూ అంతిమ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డిలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మోదీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతోందని ధ్వజమెత్తారు. సైన్యంలోనూ ఔట్ సోర్సింగ్ విధానం తీసుకురావటం దారుణమన్నారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.