Minister Errabelli: వరంగల్ ఎంజీఎంలో ఎలుకల వేట మొదలైంది. వైద్యనగరిగా అభివృద్ధి చేయతలపెట్టిన ఓరుగల్లులో.. ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించటంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారిన ఎంజీఎంలో ఎలుకల కారణంగా చాలా రోజులుగా రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా ఐసీయూలో చికిత్సపొందుతున్న శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కొరికేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో ఘటనకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావును బాధ్యుడిని చేస్తూ తొలగించారు. ప్రక్షాళనలో భాగంగా ఆస్పత్రిలో శుభ్రతాచర్యలను చేపట్టారు. ఆస్పత్రిలో ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసి ఎలుకలను బంధిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంజీఎంను సందర్శించి పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నిర్లక్ష్యం వల్లే.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. రోగి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ఐసీయూలో ఎలుకలు కరవడం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. ఆస్పత్రులను మెరుగు చేస్తున్నామని.. ఇలాంటి లోపాలు ఉండటం కూడా సరికాదని మంత్రి తెలిపారు. ఎంజీఎంలో సౌకర్యాలపై వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. రోగిని ఎలుక కొరికిన ఘటన వివరాలను తెలుసుకున్నారు. బాధితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. అతడిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. బాధితుడి కుటుంబ సభ్యులు కూడా నిమ్స్‌కు తరలించేందుకు ఒప్పుకున్నారన్నారు. నిమ్స్‌లో అతనికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సమగ్ర విచారణ చేస్తున్నాం.. ఎంజీఎంలో జరిగిన ఘటన బాధాకరం. విషమంగా ఉన్న పరిస్థితిలోనే రోగి ఎంజీఎంకు వచ్చారు. రోగిని ఎలుకలు కొరికేయడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నాం. ఇంకా ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. రోగిని మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. -ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర మంత్రి